ఆదిలాబాద్‌టౌన్: అతివలకు అండగా షీటీం బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో గురువారం షీటీం పనితీరుపై ఆగస్టు నివేదిక విడుదల చేశారు. అనంతరం పోలీస్ అక్కలు, షీటీం సభ్యులతో సమావేశమై మాట్లాడారు. ఆగస్టులో 136 ఫిర్యాదులు అందగా, ఇందులో 117 ఈ–పెట్టి కేసులు, ఐదు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడంతో పాటు 14మందికి కౌన్సెలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. 163 హాట్‌స్పాట్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. రెండు బాల్య వివాహాలు అడ్డుకున్నట్లు తెలిపారు. పాఠశాలలు, కళాశాలలను తరచూ సందర్శించి విద్యార్థుల సమస్యలు తెలుసుకోవాలని, వేధింపులను అరికట్టేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. మహిళల భద్రత, సైబర్ నేరాలు, వేధింపులు, బాల్య వివాహాల నివారణ తదితర అంశాలపై జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులతో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని పేర్కొన్నారు. ఫొటోలు, వీడియోలను దుర్విని యోగం చేస్తూ బ్లాక్‌మెయిల్, వేధింపులకు పాల్పడే వారిపై అప్రమత్తంగా ఉండాలని, సమస్య ఎదురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన సిబ్బంది ని అభినందించి ప్రశంసాపత్రాలు, నగదు రివార్డులు అందజేశారు. అత్యవసర పరిస్థితుల్లో షీటీంను 87126 59953 నంబర్‌లో, డయల్ 100, 112కు సమాచారం ఇవ్వాలని సూచించారు. అదనపు ఎస్పీ మౌనిక, డీఎస్పీ జీవన్‌రెడ్డి, ఎస్బీ డీఎస్పీ వెంకటనర్సయ్య, పట్టణ సీఐలు, షీటీం సభ్యులు సుశీల, రోహిణి, లావణ్య, మహేశ్, సిబ్బంది పాల్గొన్నారు.
బలమైన వ్యవస్థను అమలు చేయాలి
విజిబుల్ పోలీసింగ్, బలమైన పోలీస్ వ్యవస్థను అమలు చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీస్ అధికారులతో మాట్లాడారు. రాజీకి అవకాశమున్న కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించాలని ఆదేశించారు. గణేశ్ మండపాల వివరాలను ముందస్తుగా నమోదు చేసుకోవాలని, మండల స్థాయిలో శాంతికమిటీ సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని సూచించారు. సైబర్ నేరాల నియంత్రణకు ప్రత్యేక దృష్టి సారించాలని, అదనపు ఎస్పీలు, డీఎస్పీలు పోలీస్‌స్టేషన్లను సందర్శించాలని ఆదేశించారు. అదనపు ఎస్పీ మౌనిక, ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్‌సాయి కొట్టే, డీఎస్పీలు జీవన్‌రెడ్డి, వెంకటనర్సయ్య, సీఐలు, సిబ్బంది పాల్గొన్నారు.


