ఉట్నూర్‌రూరల్: ఉట్నూర్ పట్టణానికి చెందిన ఉస్కామొల్ల నాగన్న పాత నాణేలు, విదేశీ కరెన్సీ సేకరణను హాబీగా చేసుకున్నారు. పాత బస్టాండ్ ఆవరణలో ఓ చిన్న పాన్ షాప్ నడుపుకొనే నాగన్న ఇప్పటివరకు పాత నాణేలతోపాటు 57 దేశాల కరెన్సీని సేకరించారు. దేశానికి స్వాతంత్య్రం రాకముందు వాడుకలో ఉన్న రాగి నాణేలు, అణాలు, పైసల నుంచి మొదలుకుని నేటి ఆధునిక కరెన్సీ వరకు నాగన్న వద్ద విభిన్న రకాల నాణేలున్నాయి. బ్రిటిష్ కాలం నాటి రాగి నాణేలు, నిజాం నవాబుల కాలం నాటి నాణేలు, పాతకాలపు రంధ్రం నాణేలు, ఒక పైసా, రెండు పైసలు, మూడు పైసలు, ఐదు పైసలు, ఇందిరాగాంధీ, నెహ్రూ బొమ్మల నాణేలను ఆయన ఎంతో భద్రంగా దాచారు. తన షాప్‌నకు వచ్చే వారికి నాణేలు చూపిస్తూ అప్పటి చరిత్రను వివరిస్తుంటారు. అతని అభిరుచిని చూసిన వారంతా అభినందించకుండా ఉండలేకపోతున్నారు.


