ఒంగోలు మెట్రో: సినీరంగంలో బహుముఖ ప్రజ్ఞాశాలి పద్మభూషణ్ పాలువాయి భానుమతి రామకృష్ణ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 9వ తేదీ ఉదయం పది గంటల నుంచి ఒంగోలు అంజయ్య రోడ్డులోని ఏకేవీకే కాలేజీ ఆవరణలో ఆమె నటించిన సినిమా పాటలు, నృత్యాలు, డైలాగులపై (3 నిమిషాలకు మించకుండా) మహిళలకు పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు దాసరి కృష్ణారావు తెలిపారు. స్థానిక అంజయ్య రోడ్డులోని సూర్య బలిజ భవనంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో సంబంధిత పోస్టర్లు ఆవిష్కరించారు. విజేతలకు ఆమె జయంతి అయిన సెప్టెంబర్ 7వ తేదీ బహుమతులు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ నెల ఐదో తేదీలోగా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా రంగభూమి కళాకారుల సంఘ అధ్యక్షుడు బేతంశెట్టి హరిబాబు, రంగస్థల నటుడు ధేనువకొండ సుబ్బయ్య, ప్రకాశం జిల్లా రచయితల సంఘ అధ్యక్షుడు పొన్నూరు శ్రీనివాస్, గడియారం సుబ్బయ్య శర్మ, తీగల సత్యవతి, ఆలిండియా కళా రంగం ప్రకాశం జిల్లా అధ్యక్షురాలు చల్లా నాగేశ్వరమ్మ, గాయని తాళ్లూరి శ్రీదేవి, చందూ డ్యాన్స్ అకాడమీ, నళినీ ప్రియ కూచిపూడి నృత్య అకాడమీ ప్రతినిధులు పాల్గొన్నారు.


