సంతనూతలపాడు:
రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ వ్యవస్థలో ప్రతిపాదిత మార్పులు వివాదానికి దారితీశాయి. జీఓ నంబర్ 396తో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల (ఆర్‌ఎస్‌కే) నిర్వహణను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని డాక్యుమెంట్ రైటర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమ జీవనోపాధిని దెబ్బకొడుతున్నారని నిరసిస్తూ జూలై 20వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పెన్ డౌన్ పాటిస్తూ సమ్మెకు పూనుకున్న విషయం విధితమే. వీరి ఆందోళన వలన పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు మందగించాయి. ప్రభుత్వ ఆదాయానికి కోట్ల రూపాయల గండి పడింది. 11 రోజులుగా డాక్యుమెంట్ రైటర్ల పెన్ డౌన్ కారణంగా సంతనూతలపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారా ప్రభుత్వ ఆదాయానికి రూ.90 లక్షలకుపైగా గండి పడినట్లు సమాచారం.
కొత్త విధానంపై పలు సందేహాలు...
ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న కొత్త విధానంలో రూ.2 వేలు చెల్లిస్తే కేవలం 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తామని ప్రకటించింది. అయితే దీనిపై దస్తావేజు లేఖరులతో పాటు ఆస్తుల కొనుగోలు, విక్రయాలు చేసే వారిలోనూ పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భూ యాజమాన్య పత్రాల పరిశీలన, ఈసీ ధ్రువీకరణ, చట్టపరమైన అంశాల పరిశీలన, పక్షాల గుర్తింపు.. తదితర కీలక ప్రక్రియలు ఉంటాయని, వీటిని కేవలం 10 నిమిషాల్లో పూర్తి చేయడం ఆచరణ సాధ్యం కాదని తేల్చిచెబుతున్నారు. వేగవంతమైన సేవల పేరిట భవిష్యత్తులో న్యాయపరమైన వివాదాలు పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రైవేటీకరణపై అభ్యంతరాలు...
ఇప్పటివరకు అనుభవజ్ఞులైన దస్తావేజు లేఖరులు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కీలకపాత్ర పోషిస్తూ పత్రాల్లో పొరపాట్లు లేకుండా చేస్తూ వచ్చారు. ఇప్పుడు అదే బాధ్యతను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగిస్తే పారదర్శకత ఉంటుందా..? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రభుత్వం సేవలను మరింత సులభతరం చేయాలనుకుంటే వాటిని పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగంతోనే నిర్వహించాలని, ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం వలన అదనపు భారం ప్రజలపై పడే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. జీఓ నంబర్ 396ను వెంటనే ఉపసంహరించుకోవాలని, వందేళ్లకుపైగా కొనసాగుతున్న దస్తావేజు లేఖరుల వ్యవస్థను కొనసాగించాలని డాక్యుమెంట్ రైటర్లు డిమాండ్ చేస్తున్నారు. జూలై 6, 7 తేదీల్లో శాంతియుత నిరసనలు, ఆ తర్వాత 20వ తేదీ నుంచి శుక్రవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా పెన్ డౌన్ కార్యక్రమం కొనసాగించారు. అయినా ప్రభుత్వం దిగిరాకపోవడంతో మళ్లీ కొత్త కార్యాచరణతో ఆందోళన బాట తప్పదని సంకేతాలిచ్చారు.
న్యాయపరంగా చిక్కులు తప్పవు...
మెడికల్ కాలేజీలకు పీపీపీ విధానం తీసుకొస్తామని ప్రకటించినట్లుగా.. ప్రతి జిల్లా కేంద్రంలో పీపీపీ విధానంలో రిజిస్ట్రార్ కార్యాలయాలు, పాస్పోర్ట్ కార్యాలయాలను ఏర్పాటు చేస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఈ విధానం ప్రకారం క్రయవిక్రయదారులిద్దరూ ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలకు వెళ్లి వారి దస్తావేజులు తయారు చేసుకుని సబ్ రిజిస్ట్రార్ వద్దకు వెళితే ఆయన పరిశీలించి రిజిస్ట్రేషన్ చేస్తారు. అయితే, ఈ విధానంలో క్రయవిక్రయదారులకు రిజిస్ట్రేషన్ విధానంపై సరైన అవగాహన లేకపోయినా, జాగ్రత్తలు తీసుకోకపోయినా భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని, పలుమార్లు సవరణ దస్తావేజులు రాసుకోవాల్సి వస్తుందనేది డాక్యుమెంట్ రైటర్ల వాదన. ప్రజలు ఎదుర్కొనే సమస్యల్లో ప్రధానమైంది ఆస్తి తగాదాలేనని, అవి మరింత పెరిగి న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.
ఉపాధి కోల్పోనున్న డాక్యుమెంట్ రైటర్లు
11 రోజులుగా పెన్ డౌన్ చేసినా
స్పందించని ప్రభుత్వం
మళ్లీ కొత్త కార్యాచరణతో ఆందోళన చేస్తామంటున్న వైనం
ఇప్పటికే రిజిస్ట్రేషన్ సేవలకు అంతరాయం
సంతనూతలపాడు సబ్ రిజిస్ట్రార్
కార్యాలయం పరిధిలో రూ.90 లక్షలకుపైగా ప్రభుత్వాదాయానికి గండి
ప్రైవేట్ ఏజెన్సీల పాత్రపై పలు సందేహాలు


