సంతనూతలపాడు: సంతనూతలపాడు ప్రాంతానికి చెందిన సేవా సంకల్ప చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థిని విద్యాభివృద్ధికి ఆర్థిక సహాయం అందించారు. మార్కాపురం మండలం కుంచెపల్లి గ్రామానికి చెందిన కాకర్ల సౌజన్య ఒంగోలులోని శ్రీ హర్షిణి ఇంజినీరింగ్ మహిళా కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆమె విద్యను కొనసాగించేందుకు సంతనూతలపాడుకు చెందిన ఎన్నారై శిఘాకొల్లి శ్రీనివాసరావు రూ.75 వేలు విరాళం అందించారు. తండ్రి లేని సౌజన్యను చదివించేందుకు తల్లి పడుతున్న ఇబ్బందులను గుర్తించిన సేవా సంకల్ప ట్రస్ట్.. దాతల సహకారంతో ఈ సహాయాన్ని అందించింది. కార్యక్రమంలో ట్రస్ట్ ఫౌండర్ పాతూరి సంపత్, చైర్మన్ శనగల వెంకటరమణ, సలహాదారు పాదర్తి శ్రీనివాసరావు, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, డీన్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
సంతనూతలపాడు: సంతనూతలపాడు మండల స్వర్ణ గ్రామ సచివాలయాల డిప్యూటీ ఎంపీడీవోగా మండల పరిషత్ ఏవో సీహెచ్ ప్రసన్నకుమారి శుక్రవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. మండల పరిషత్ ఏవోగా పనిచేస్తున్న ప్రసన్నకుమారికి డిప్యూటీ ఎంపీడీవోగా ఉత్తర్వులను సంతనూతలపాడు ఎంపీడీవో డి.సురేష్‌బాబు అందజేశారు. ప్రస్తుతం డిప్యూటీ ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్న పి.రవికుమార్ శుక్రవారం సాయంత్రం పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో ప్రసన్నకుమారికి అదనపు బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ మండల అభివృద్ధికి కృషి చేస్తానని ప్రసన్నకుమారి తెలిపారు.
ఒంగోలు టౌన్: ఒంగోలు ఆర్టీసీ డిపోను ప్రమాదరహిత డిపోగా ఉంచేందుకు డ్రైవర్లు, మెకానిక్‌లు కృషి చేయాలని డిపో మేనేజర్ చంద్రశేఖర్ కోరారు. ఈ నెల 25 నుంచి 31వ తేదీ వరకు జరిగిన ప్రమాద రహిత వారోత్సవాలలో భాగంగా ఫెయిల్యూర్ ఫ్రీ మెకానిక్‌లకు శుక్రవారం ప్రశంసపత్రాలు అందజేశారు. ఆర్టీసీ ప్రయాణం సురక్షితం అనే నినాదాన్ని నిజం చేయాలని చెప్పారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మెకానికల్ ఇంజినీర్ విజయ, ఎస్టీ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
నాగులుప్పలపాడు: ప్రమాదవశాత్తూ నిప్పంటుకుని వరిగడ్డి వామి పూర్తిగా దగ్ధమైన ఘటన గురువారం అర్ధరాత్రి తిమ్మసముద్రం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తుల సమాచారం మేరకు.. గ్రామంలోని ఎస్టీకాలనీ సమీపంలో ఉన్న డంపింగ్ యార్డులో చెత్త తగలబెట్టడానికి గురువారం సాయంత్రం నిప్పంటించారు. దాని మంటలు వ్యాపించి డంపింగ్ యార్డు సమీపంలోని బత్తుల అన్నపూర్ణమ్మకు చెందిన పశువుల కొష్టంలోని వరిగడ్డి వామికి అంటుకున్నాయి. దీంతో వరిగడ్డి వామి పూర్తిగా తగలబడిపోయింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు చీరాల అగ్నిమాపకశాఖ అధికారులకు సమాచారం అందించగా, వారు వచ్చి మంటలను అదుపు చేసేలోపు వామి మొత్తం పూర్తిగా అగ్నికి అహుతైనట్లు గ్రామస్తులు తెలిపారు.
ఒంగోలు మెట్రో: ఆషాఢమాసం సందర్భంగా ఒంగోలు గాంధీరోడ్డులోని వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి శుక్రవారం గోరింట పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గోరింట కొమ్మలతో ఆలయ గర్భాలయాన్ని అలంకరించి అమ్మవారికి విశేష పూజలు, అర్చనలు చేశారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు అమ్మవారి ప్రసాదంగా గోరింట అందజేయగా, వారు ఒకరికొకరు గోరింటను చేతులకు పెట్టుకుని సంప్రదాయబద్ధంగా గోరింట పండుగ జరుపుకున్నారు. శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయ తదియారాధన సంఘ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.


