ఒంగోలు సిటీ: అమరావతి ఇన్‌క్లూజివ్ క్రికెట్ కప్–2026 కోసం ఒంగోలులోని సీఎస్‌ఆర్ శర్మ కాలేజీ గ్రౌండ్‌లో డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (డి.సీ.సీ.ఎ.పీ), డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర (డి.ఏ.సీ.ఏ) సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా స్థాయి దివ్యాంగ క్రికెట్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు. ‘అమరావతి ఇన్‌క్లూజివ్ క్రికెట్ కప్–2026’ టోర్నమెంట్‌లో పాల్గొనే ఉమ్మడి ప్రకాశం జిల్లా జట్టు ఎంపిక కోసం ఈ ట్రయల్స్ చేపట్టారు. డీసీఏఏ జనరల్ సెక్రటరీ యడ్లపల్లి సూర్యనారాయణ ఆదేశాల మేరకు ఉమ్మడి ప్రకాశం జిల్లా కన్వీనర్ జి.సుబ్బయ్య, ఆర్గనైజర్ ఎస్.వెంకట్రావు, పర్యవేక్షణలో ఎంపికలు చేశారు. సూర్యశ్రీ ట్రస్ట్ ఇన్‌చార్జి సర్దార్ బాష ఈ సెలెక్షన్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి దివ్యాంగ క్రికెట్ క్రీడాకారులు హాజరై తమ ప్రతిభను ప్రదర్శించారు. ఎంపికలకు హాజరైన క్రీడాకారుల నుంచి దరఖాస్తులు, దివ్యాంగుల ధ్రువపత్రాలు, ఆధార్ కార్డులను అధికారులు స్వీకరించి పరిశీలించారు. అనంతరం నెట్స్‌లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో క్రీడాకారుల ప్రతిభను పరీక్షించి, వారి క్రీడా నైపుణ్యం ఆధారంగా జట్టు ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, దివ్యాంగ క్రీడాకారులకు తమ ప్రతిభను నిరూపించుకునే వేదికగా అమరావతి ఇన్‌క్లూజివ్ క్రికెట్ కప్ నిలుస్తోందని, రాష్ట్ర స్థాయిలో మెరుగైన ప్రదర్శన కనబరిచి ఉమ్మడి ప్రకాశం జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సెలెక్షన్స్‌కి గ్రౌండ్ నెట్స్ ఫెసిలిటీ కల్పించిన సీఎస్సార్ కాలేజ్ యాజమాన్యానికి డీసీఏఏ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.


