● కలెక్టర్ పి.రాజా బాబు
ఒంగోలు సబర్బన్: వ్యర్థాల ప్రాసెసింగ్‌ను వేగవంతం చేయాలని ఒంగోలు నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారి, కలెక్టర్ పి.రాజాబాబు చెప్పారు. శుక్రవారం ఆయన ఒంగోలు నగర శివారులోని గుత్తికొండవారిపాలెం గ్రామంలో ఉన్న వ్యర్థాల డంపింగ్ యార్డును పరిశీలించారు. నగరంలో ప్రతిరోజూ సేకరించిన వ్యర్థాలను ఇక్కడ ప్రాసెసింగ్ చేస్తున్న తీరును చూశారు. కొన్నేళ్ల నుంచి వ్యర్థాలను ఇక్కడ డంపింగ్ చేస్తున్నామని, 2.56 లక్షల టన్నులు పేరుకుపోయాయని అధికారులు ఆయనకు తెలిపారు. వీటిలో ఇప్పటి వరకు 1.76 లక్షల టన్నుల వ్యర్థాలను ప్రాసెసింగ్ చేశామని వివరించారు. ఈ ప్రక్రియలో వచ్చే ఆర్.డీ.ఎఫ్.ను సిమెంట్ ఫ్యాక్టరీలకు తరలిస్తున్నామని, ఇనర్ట్ మెటీరియల్‌ను లోతట్టు ప్రాంతాలను పూడ్చేందుకు ఉపయోగిస్తున్నామన్నారు. బయో సాయిల్ పదార్థాలను ఎరువులుగా వినియోగిస్తున్నామని వారు తెలిపారు. కొత్తగా ఇక్కడ నిర్మించే డ్రై వేస్ట్ సెంటర్ పురోగతి గురించి కూడా వివరించారు. కాగా, వ్యర్థాల ప్రాసెసింగ్ త్వరగా పూర్తయ్యేలా చూడాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇందుకోసం ప్రజలు ఇంటి వద్దే తడిచెత్తను, పొడిచెత్తను వేరు చేసేలా అవగాహన కల్పించాలని చెప్పారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వలన కలిగే అనర్థాలను కూడా ప్రజలకు వివరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట ఒంగోలు మునిసిపల్ కమిషనర్ వెంకట కృష్ణయ్య, పబ్లిక్ హెల్త్ ఈ.ఈ. శ్రీనివాస సంజయ్, మున్సిపల్ ఇంజనీర్ యేసయ్య, డీ.ఈ.ఈ. పద్మజ, మెడికల్ ఆఫీసర్ వైష్ణవి, ఇతర అధికారులు ఉన్నారు.


