● ఆర్డీఓ చంద్రశేఖరనాయుడు హెచ్చరిక
మద్దిపాడు: రీసర్వే సమయంలో సర్వేయర్లు ఇస్టానుసారంగా సర్వే చేసి తప్పులు చేస్తే ఇంటికి వెళ్లడమే అంటూ ఆర్డీఓ చంద్రశేఖరనాయుడు హెచ్చరించారు. స్థానిక మండల తహసీల్దార్ కార్యాలయంలో సర్వేయర్లు, వీఆర్‌ఓలతో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గ్రామాల వారీగా సర్వే వివరాలడిగి తెలుసుకున్నారు. సమస్యలు పదేపదే ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. సర్వేయర్లు చేసిన తప్పులకు తాము ఎందుకు ఉన్నతాధికారుల వద్ద మాటలు పడాలంటూ ప్రశ్నించారు. కొందరు సర్వేయర్లను లేపి వారి గ్రామాల్లో జరిగిన సర్వేలో జరిగిన లోపాలను ఎత్తి చూపారు. సిబ్బంది భూ సమస్యలను సృష్టించడం వలన రైతులు ఇబ్బందులు ఎదుర్కొని పీజీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు, అంతేగాకుండా రాష్ట్రంలోనే భూ సమస్యల పరిష్కారంలో మన జిల్లా వెనుకబడి ఉందన్నారు. మద్దిపాడు మండలంలో జరుగుతున్న రీసర్వేలో సమస్యలు వెల్లువెత్తుతున్నాయన్నారు. భూ సమస్యలు సృష్టించి వాటిని సొమ్ము చేసుకుని రైతులను ఇబ్బందులకు గురిచేస్తే వారిపై చర్యలు కఠినంగా ఉంటాయని స్పష్టం చేశారు. ఒక సర్వేయర్ పని తీరు సరిగా లేదని, అతనికి షోకాజ్ నోటీసు జారీ చేయాలని తహసీల్దార్ ఆదిలక్ష్మిని ఆర్డీఓ ఆదేశించారు. వీఆర్‌ఓ, సర్వేయర్ ఇద్దరూ పరస్పర సహకారంతో రీ సర్వే పూర్తి చేయాలని సూచించారు. ఆయన వెంట డివిజినల్ సర్వేయర్ నాళం వెంకటేశ్వర్లు, డీటీ అజయ్‌కుమార్‌రెడ్డి ఆర్‌ఐ రమణయ్య, వీఆర్‌ఓలు, సర్వేయర్లు పాల్గొన్నారు.


