ఉగ్ర గోదారి | - | Sakshi
Sakshi News home page

ఉగ్ర గోదారి

Aug 1 2026 12:16 AM | Updated on Aug 1 2026 12:16 AM

గంటగంటకూ పెరుగుతూ..

భద్రాచలానికి ఎగువన ఉన్న తాలిపేరు, మేడిగడ్డ, తాటాకులగూడెం, శ్రీరాంసాగర్‌, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుల నుంచి శుక్రవారం కూడా వరద నీరు భారీగా వస్తోంది. దీంతో, భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం గంటగంటకూ పెరుగుతోంది. భద్రాచలం వద్ద శుక్రవారం ఉదయం 40 అడుగులుగా ఉన్న గోదావరి నీటిమట్టం రాత్రి 7 గంటలకు 50 అడుగులకు, 8 గంటలకు 50.60 అడుగులకు చేరింది. 12,91,256 క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తోంది. రాత్రి 9 గంటలకు గోదావరి నీటిమట్టం 51.20 అడుగులకు పెరిగింది. 13,24,981 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోంది. నీటిమట్టం ఉదయం 10.15 గంటలకు 43 అడుగులకు చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరిక, మధ్యాహ్నం 3.48 గంటలకు 48 అడుగులకు చేరుకోవడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నీటిమట్టం 53 అడుగులకు పెరిగితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశముంది.

గోదావరికి వరద పోటు

శబరికి ఎగపోటు

నీట మునిగిన రహదారులు

50 గ్రామాలకు నిలిచిన రాకపోకలు

చింతూరు: గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తోంది. కూనవరం, వరరామచంద్రపురం, ఎటపాక, చింతూరు మండలాలపై వరద ప్రభావం పడింది. గంటగంటకూ గోదావరి వరద పెరుగుతూండటంతో చింతూరు మండలంలో శబరి నది ఎగపోటుకు గురైంది. గోదావరి, శబరి నదుల ఉధృతి కారణంగా నాలుగు మండలాల్లోని వాగులు పొంగి వరద నీరు ప్రధాన రహదారులను ముంచెత్తుతోంది. చింతూరు డివిజన్‌ పరిధిలో సుమారు 50 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి, శబరి నదుల ఉధృతి మరింత పెరుగుతూండటంతో పరీవాహక గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి, సురక్షిత ప్రాంతాలకు తరలుతున్నారు.

నిలిచిన రాకపోకలు

గోదావరి, శబరి నదుల వరద ప్రధాన రహదారులపై చేరడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు మండలంలో సోకిలేరు వాగు పొంగి చూటూరు, నర్సింగపేట మధ్య ప్రధాన రహదారి పైకి చేరింది. దీంతో, చింతూరు, వరరామచంద్రపురం మండలాలతో పాటు చింతూరు మండలంలో 11 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కూనవరం మండలం కొండ్రాజుపేట కాజ్‌వేపై వరద నీరు చేరడంతో 13 గ్రామాలకు, ఎటపాక మండలం నెల్లిపాక – వీరాయిగూడెం నడుమ, కన్నాయిగూడెం – గట్టుగూడెం నడుమ వరద నీరు చేరడంతో 4 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరరామచంద్రపురం మండలం చింతరేవుపల్లి – కన్నాయిగూడెం, రామవరం – రామవరంపాడు, ప్రత్తిపాక – అడవి వెంకన్నగూడెం, పోచవరం – ఇప్పూరు, శ్రీరామగిరి – సీతంపేట నడుమ వరద నీరు రహదారి పైకి చేరడంతో సుమారు 30 గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. దీంతోపాటు భద్రాచలం – కూనవరం ప్రధాన రహదారిలో పోలిపాక, మురుమూరు వద్ద రహదారి పైకి వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

అప్రమత్తమైన అధికారులు

చింతూరు డివిజన్‌లో వరద పరిస్థితులు నెలకొనడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్‌ కె.దినేష్‌ కుమార్‌ శుక్రవారం పర్యటించి, పరిస్థితిని సమీక్షించారు. గోదావరి, శబరి నదుల నీటిమట్టాలు పెరుగుతున్నందున అన్ని శాఖల అధికారులూ ముందస్తు చర్యలతో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. జిల్లాలో వరద ప్రభావానికి గురయ్యే 189 గ్రామాలను గుర్తించామని, 34 వేల కుటుంబాలు ప్రభావితమయ్యే అవకాశముందని తెలిపారు. అవసరమైతే ప్రజలను తరలించేందుకు 32 బోట్లను, 150 పునరావాస కేంద్రాలను సిద్ధం చేశామని చెప్పారు. ముంపు ప్రభావిత గ్రామాలను గుర్తించడంతో పాటు అక్కడి ప్రజలకు తాగునీరు, ఆహారం, నిత్యావసరాల సరఫరా వంటివి చేపట్టాలని రెవెన్యూ శాఖను ఆదేశించారు. సహాయక చర్యల నిమిత్తం పోలీసు, అగ్నిమాపక, మత్స్యశాఖ సిబ్బంది సిద్ధంగా ఉండాలని, లైఫ్‌ జాకెట్లు, బోట్లు, ర్యాపిడ్‌ రెస్క్యూ బృందాలు అందుబాటులో ఉండాలని అన్నారు.

వైద్య, ఆరోగ్య శాఖ ద్వారా గర్భిణులు, వృద్ధులు, దీర్ఘకాలిక రోగులను ముందుగా ఆసుపత్రులకు తరలించాలని, పునరావాస కేంద్రాలు, ఆసుపత్రులకు నిరంతర విద్యుత్‌ అందేలా ఆ శాఖ చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement