● గుండెపోటు వచ్చిన
మహిళకు ఏఎస్సై సాయం
● జీపులో ఆస్పత్రికి తరలించిన వైనం
● ఎస్పీ అభినందనలు అందుకున్న సిబ్బంది
కాకినాడ క్రైం: గుండెపోటుతో ప్రాణాపాయ స్థితిలో వున్న ఓ మహిళను ఓ ఏఎస్సై సకాలంలో ఆస్పత్రికి తరలించి ఆమె ప్రాణాలు కాపాడారు. వివరాలు ఇలా ఉన్నాయి. ప్రత్తిపాడు పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తున్న ఏఎస్సై రమణమూర్తి, గురువారం అర్థరాత్రి సర్కిల్ పరిధిలో సాధారణ తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఏలేశ్వరంలో స్థానికులైన వీరభద్రరావు తన కుమారుడు సాయితో పరుగున వచ్చి తమ అత్త పొన్నాడ వరలక్ష్మికి అకస్మాతుగా గుండెపోటు వచ్చిందని, 108 రావడానికి సమయం పట్టేలా ఉందని, ఆటోలు సైతం ఆపడం లేదని, ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు సాయం చేయాలని బడిమాలారు. తక్షణమే స్పందించిన ఏఎస్సై వారితో వెళ్లి ఆ మహిళను జీపులో ఎక్కించుకుని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఆటోల కోసం ప్రయత్నిస్తున్నామని, ఎవరూ ఆపట్లేదని ఆందోళనతో చెప్పారు. ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సహాయం చేయాలని వేడుకున్నారు. తక్షణమే స్పందించిన ఏఎస్సై వారితో ఇంటికి వెళ్లి ఆమెను జీపులో ఎక్కించుకుని తోడుగా వచ్చిన కుమార్తెతో తల్లికి సీపీఆర్ ఎలా చేయాలో చూపి కొనసాగించమని సూచించి ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడి వైద్యులు ఆమెను పరీక్షించి అత్యవసర పరిస్థితిని గమనించి ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. కొంచెం ఆలస్యమై ఉంటే ప్రాణానికి ప్రమాదమయ్యేదని వివరించారు. సకాలంలో ఆమెను ఆసుపత్రికి తరలించిన ఏఎస్సై మూర్తికి వైద్యులు, కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. అలాగే జీపు డ్రైవర్, హోంగార్డు చిరంజీవిని సీఐ అప్పారావు అభినందించారు. మూర్తి సేవాస్ఫూర్తిని కొనియాడిన ఎస్పీ బిందు మాధవ్ ఆయన చొరవ ప్రజల్లో పోలీస్ శాఖ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేసిందని అన్నారు.


