ఫ స్కీం వర్కర్ల డిమాండ్
ఫ రంపచోడవరంలో భారీ ర్యాలీ
ఫ కలెక్టరేట్ వద్ద ధర్నా
రంపచోడవరం: తమకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని అంగన్‌వాడీ, ఆశా, వీఓఏ (యానిమేటర్లు), మధ్యాహ్న భోజన పథకం తదితర స్కీమ్ వర్కర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యాన రంపచోడవరంలో సీపీఎం కార్యాలయం నుంచి అంబేద్కర్ జంక్షన్ మీదుగా కలెక్టరేట్ వరకూ భారీ ర్యాలీ, కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తమ డిమాండ్లు నెరవేర్చాలని నినదిస్తూ ఆందోళన చేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం.వాణిశ్రీ, పల్లపు వెంకట్, అంగన్‌వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్, వీఓఏ సంఘాల జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బత్తిన నిర్మల, ముసురు రాజేశ్వరి, వీరమ్మ, పుష్ప, మడి వెంకట రామలక్ష్మి, అరగటి రామకృష్ణ, లక్ష్మయ్య, సీఐటీయూ జిల్లా నాయకులు కంభం శాంతిరాజు, పుట్ట రామరాజు తదితరులు మాట్లాడుతూ, స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను స్కీం వర్కర్లకు కూడా వర్తింపజేయాలని, పెన్షన్, పీఎఫ్, ఈఎస్‌ఐ వంటి సామాజిక భద్రతా సౌకర్యాలు కల్పించాలని, ఖాళీగా ఆశా కార్యకర్తల పోస్టులు భర్తీ చేయాలని, అన్ని రకాల సెలవులు, మట్టి ఖర్చులు ఇవ్వాలని, ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం పోస్టుల భర్తీలో ఆశా కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాలని, మధ్యాహ్న భోజన పథకంలో స్మార్ట్ కిచెన్ ప్రతిపాదనను విరమించుకోవాలని, ప్రతి విద్యార్థికీ మెనూ చార్జీ రూ.20 పెంచాలని, అంగన్‌వాడీలకు నవచైతన్య యాప్ రద్దు చేయాలని, పని భారం తగ్గించాలని, 164 అంగన్‌వాడీ సూపర్‌వైజర్ పోస్టులు భర్తీ చేయాలని, మిగిలిపోయిన మినీ వర్కర్లందరినీ మెయిన్ వర్కర్లుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవ్చేకపోతే భవిష్యత్తులో ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు, ఆయా రంగాల కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


