కై లాస్‌నగర్: ఇవి రెండే కాదు జిల్లాకేంద్రంలో రూ.కోట్ల విలువైన బల్దియా లీజు స్థలాలు ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలోకి వెళ్లాయి. ఇవన్నీ డిమాండ్ కలిగిన ప్రాంతాల్లో ఉండటంతో లీజుకు తీసుకున్న కొందరు అక్రమంగా వాటిని హస్తగతం చేసుకున్నారు. రెవెన్యూ శాఖ అండతో పట్టాలు పొంది సొంతం చేసుకోగా, మరికొంత మంది నకిలీ పత్రాలను సృష్టించి కబ్జాలకు పాల్పడ్డారు. బల్దియా లీజుకు ఇవ్వడం ప్రారంభించిన సమయంలో 42 అద్దె స్థలాలు ఉండగా ప్రస్తుతం ఈ సంఖ్య 14కు తగ్గిపోవడం గమనార్హం.
అధికారుల పర్యవేక్షణలోపమే..
మున్సిపల్ స్థలాలను బల్దియా అధికారులు 1952 నుంచి లీజుకు ఇస్తున్నారు. ప్రతీ మూడేళ్లకోసారి రెన్యూవల్‌తో పాటు అద్దె పెంచాల్సి ఉంటుంది. అయితే పాలకుల పట్టింపులేమి, అధికారుల నిర్లక్ష్యాన్ని లీజుదారులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఫలితంగా రూ.కోట్ల విలువైన స్థలాలను తమ పేరిట పట్టా చేయించుకున్నారు. ఏకంగా 28 స్థలాల వరకు అన్యాక్రాంతం కావడం గమనార్హం. 14 లీజు స్థలాలు మిగిలినట్లు బల్దియా అధికారులు చెబుతున్నప్పటికీ ఇందులో చాలా వరకు వివా దాస్పదంగానే ఉన్నాయి. అక్రమణదారులు కోర్టును ఆశ్రయించడంతో కేసులు నడుస్తున్నాయి. ఎలాంటి వివాదం లేనివి కేవలం ఎనిమిది మాత్రమే ఉన్నాయి.
ఎట్టకేలకు బల్దియా దృష్టి ..
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా బల్దియా అధికారులు ఎట్టకేలకు లీజుస్థలాల పరిరక్షణపై దృష్టి సారించారు. వాటి సమగ్ర సమాచారాన్ని సేకరించేందుకు ప్రత్యేక సర్వే చేపట్టాలని నిర్ణయించారు. లీజు స్థలాలు ఎక్కడ ఉన్నాయి.. వి స్తీర్ణం ఎంత.. హద్దులేంటనే వివరాలను డిఫరెన్షియ ల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం(డీజీపీఎస్) ద్వారా తేల్చనున్నారు. ప్రస్తుతం మున్సిపల్ అధికారులు ప్రాథమికంగా లీజు స్థలాల వివరాలు సేకరిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక డీజీపీఎస్ చేపట్టనున్నారు. సర్వే అనంతరం హద్దులు గూగుల్‌లో తెలుసుకునేలా కీహోల్ మార్కప్ లాంగ్వేజ్ (కేఎంఎల్) ఫార్మట్‌లో నమోదు చేస్తారు. తద్వారా గూగుల్ మ్యాప్‌లో నేరుగా వాటి సమాచారాన్ని తెలుసుకునే వెసులుబాటు లభించనుంది. అలాగే పూర్తి వివరాలను డిజిటల్ ల్యాండ్ ఇన్పర్మేషన్ సిస్టం (డీఎల్‌ఐఎస్) వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.
స్వాధీనం చేసుకునేందుకే
ప్రత్యేక సర్వే
బల్దియా స్థలాలను పరిరక్షించేందు కోసమే డీజీపీఎస్ సర్వే చేపడుతున్నాం. ఇటీవల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశాన్ని చేర్చి ఆమోదం తీసుకోవడం జరిగింది. ప్రతి లీజు స్థలం సమగ్ర సమాచారాన్ని ఈ సర్వేలో సేకరించి గూగుల్‌లో ప్రతి ఒక్కరూ తెలుసుకునేలా అందుబాటులో ఉంచుతాం. అక్రమంగా కబ్జా చేసిన ప్రతీ స్థలాన్ని మున్సిపల్ పాలకపక్షం అండతో స్వాధీనం చేసుకునేలా చర్యలు తీసుకుంటాం.
– నవీన్‌కుమార్,
పట్టణ ప్రణాళిక విభాగం అధికారి
బల్దియా మొత్తం లీజు స్థలాలు 42
ప్రస్తుతం మిగిలి ఉన్నవి 14
ఇందులో ఎలాంటి వివాదం లేనివి 08


