కై లాస్‌నగర్: పీఏసీఎస్‌లు ఆర్థికంగా బలపడేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్, కేంద్ర సహకార బ్యాంకు ప్రత్యేకాధికారి రాజర్షిషా ఆదేశించారు. డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పనితీరు, ఆర్థిక స్థితిగతులు, పీఏసీఎస్‌ల ద్వారా అందిస్తున్న సేవలు, బ్యాంకింగ్ కార్యకలాపాల పురోగతిపై సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సంఘాల వ్యాపార వృద్ధిని మరింత పెంచేలా ప్రత్యేక దృష్టి సారించి, మెరుగైన పనితీరు కనబరచాలని సూచించారు. నాబార్డ్ ఆధ్వర్యంలోని పీఏసీఎస్ యాక్సిలరేటర్ ప్రోగ్రాం, ధాన్యం నిల్వ పథకం అమలుకు సంబంధించి అర్హత ఉన్న సంఘాలను గుర్తించి, వాటి అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఆర్‌ఎస్.చిత్రు, జిల్లా సహకార అధికారి సత్యనారాయణ, డీసీసీబీ సీఈవో ఆర్.చండి విశ్వేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.


