ఆగస్టు అంటే ఆందోళనే..
గోదావరికి ఇప్పటి వరకూ మూడో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి వరద ఉధృతి 23 సార్లు రాగా, ఇందులో 12 సార్లు ఆగస్టులోనే రావడం గమనార్హం. ఇప్పటి వరకూ గోదావరి నదికి ప్రమాదకర స్థాయిలో వరద వచ్చింది కూడా ఆగస్టు నెలలోనే. 1986లో 75.60 అడుగుల మేర వచ్చిన వరద అప్పట్లో గోదావరి తీర ప్రాంతంలోని 14 మండలాల్లో బీభత్సం సృష్టించింది. భద్రాద్రి రామయ్య పాదాలను గోదారమ్మ తాకినట్లు చెబుతున్న వరదలు కూడా ఆగస్టులోనే కావటం గమనార్హం. నాటి వరదలను ఈ ప్రాంత వాసులు ఇప్పటికీ మరచిపోలేదు. 1986 నాటి వరదల కారణంగా గోదావరి తీరం వెంబడి ఉన్న వందల గ్రామాల్లోని పలు కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకు నివాసాలు మార్చుకున్నారు.
ఎటపాక: ఆగస్టు నెల వస్తోందంటే చాలు.. విలీన మండలాల ప్రజలు ‘అమ్మో’ అంటూ ఆందోళన చెందుతూంటారు. గోదావరి వరదలే దీనికి కారణం. సాధారణంగా ఏటా జూలై నుంచి అక్టోబర్ వరకూ గోదావరికి వరదలు వస్తూంటాయి. ఈ ఏడాది జూలై నెలలో వరద ముప్పు లేనప్పటికీ ఆగస్టులో ఈ ముప్పు తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. దీంతో, గోదావరి పరీవాహక ప్రాంత ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఆగస్టులో గోదావరికి వరద పరిపాటి అనే విషయాన్ని గత గణాంకాలే చెబుతున్నాయి. గోదావరికి వరద వచ్చినప్పుడల్లా ఈ నదీ తీరం వెంబడి జిల్లాలో ఉన్న ఎటపాక, కూనవరం, వరరామచంప్రురం, చింతూరు మండలాలు, ఏలూరు జిల్లాలోని కుకునూరు, వేలేరుపాడు విలీన మండలాల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ మండలాల్లో పంటలతో పాటు, గ్రామాలకు గ్రామాలే నీట మునిగి, రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయి, జనజీవనం అస్తవ్యస్తమవుతుంది. అనేక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి.
ఎడతెరిపి లేని వానలతో..
ఎల్‌నినో ప్రభావంతో సరైన వర్షాలు లేక ఈ ఏడాది ఇప్పటి వరకూ గోదావరి వెలవెలపోతూనే కనిపించింది. కొద్ది రోజులుగా ఎగువన ఉన్న మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తూండటంతో ఎట్టకేలకు జూలై చివరి వారంలో గోదావరికి వరద తాకిడి మొదలైంది. దీంతో, ఎగువ ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతున్నాయి. వరద మరింత పెరుగుతుందనే సంకేతాలు కనబడుతూండటంతో ఈ ఆగస్టులో గోదారమ్మ ఉగ్రరూపాన్ని చూడాల్సి వస్తుందనే ఆందోళన ఈ ప్రాంత వాసుల్లో మొదలైంది.
సీడబ్ల్యూసీ గణాంకాలు ఇలా..
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టాన్ని అడుగుల్లో కొలుస్తారు. ఇక్కడ కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) కార్యాలయాన్ని 1976లో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి మాత్రమే ఇక్కడి వరదలకు సంబంధించిన గణాంకాలు అందుబాటులో ఉన్నాయి. (అయితే, 1953లో భద్రాచలం వద్ద 73 అడుగుల మేర వరద వచ్చినట్లు సీడబ్ల్యూసీ నిర్ధారించింది.) భద్రాచలం వద్ద 43 అడుగుల నీటిమట్టం నమోదైతే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. 48 అడుగులు వస్తే రెండో, 53 అడుగులు నమోదైతే మూడో ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తారు. ఇప్పటి వరకూ ఉన్న లెక్కల ప్రకారం గోదావరికి 1986 ఆగస్టులో అతి పెద్ద వరద వచ్చింది. అప్పట్లో భద్రాచలం వద్ద నది నీటిమట్టం ఏకంగా 75.60 అడుగులుగా నమోదైంది. ఆ తరువాత 2022 జూలైలో రెండో అతి పెద్ద వరద (71.30 అడుగులు), 1990 ఆగస్టులో మూడో అతి పెద్ద వరద (70.80 అడుగులు) నమోదయ్యాయి. 2006లో 66.90 అడుగులు, 1976లో 63.90 అడుగుల మేర భద్రాచలం వద్ద వరద నీటిమట్టం నమోదైంది. ఈ ఐదు అత్యధిక వరదల్లో మూడు ఆగస్టులోనే రావటం గమనార్హం.
భద్రాచలం వద్ద 1953 నుంచి ఏటా ఆగస్టులో వచ్చిన గోదావరి వరదల వివరాలు
సంవత్సరం నీటి
మట్టం
(అడుగులు)
1953 73.0
1977 49.9
1980 48.0
1981 58.9
1982 34.5
1983 63.5
1984 38.8
1985 36.9
1986 75.6 (ఇప్పటి వరకూ గోదావరికి వచ్చిన అతి పెద్ద వరద ఇదే)
1990 70.8 (ఇది మూడో
అతి పెద్ద వరద)
1991 46.3
1992 52.9
1993 37.0
1996 30.0
1997 34.7
1999 41.1
2000 54.6
2001 53.8
2002 50.0
2004 37.6
2006 66.9
2007 53.7
2008 47.3
2009 31.0
2010 59.7
2012 46.4
2013 61.6
(రెండోసారి 60.6)
2018 34.8
2020 61.6
2022 51.6
2025 52.0
ఆ మూడు నెలలూ కీలకం
ఏటా జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లోనే గోదావరికి ఎక్కువగా వరద పోటెత్తుతూంటుంది. ఇప్పటి వరకూ జూన్ నెలలో గోదావరిలో రెండుసార్లు అత్యధిక నీటిమట్టం నమోదైంది. 1976 జూన్‌లో 63.9 అడుగులకు వరద ఉధృతి చేరింది. జూలైలో 10 సార్లు 53 అడుగులు దాటి వరదలు వచ్చాయి. ఇందులో 2022లో అత్యధికంగా 71.3 అడుగులు నమోదైంది. సెప్టెంబర్‌లో ఆరుసార్లు గోదావరికి వరదలు రాగా, ఇందులో నాలుగుసార్లు మూడో ప్రమాద హెచ్చరిక దాటి నీటిమట్టం నమోదైంది. అక్టోబర్ నెలకు వస్తే 1995లో మాత్రమే 57.6 అడుగుల మేర వరద వచ్చింది.
ఈ నెలలోనే గోదావరికి
ఎక్కువసార్లు భారీ వరదలు
గత గణాంకాలతో
తీరప్రాంత వాసుల ఆందోళన
విలీన మండలాలపై తీవ్ర ప్రభావం


