కూనవరం: జిల్లాలో 189 వరద ప్రభావిత గ్రామాలను గుర్తించామని కలెక్టర్ కె.దినేష్ కుమార్ తెలిపారు. మండలంలో ముందుగా ముంపునకు గురయ్యే శబరి కొత్తగూడెం, ఉదయ భాస్కర్ కాలనీల్లోని పునరావాస కేంద్రాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. పునరావాస కేంద్రాల్లో తాగునీరు, పారిశుధ్యం, ఆహారం, వైద్యం, పడకలు సక్రమంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రజల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. చుట్టూ వరద నీరు చేరిన శబరి కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని పరిశీలించారు. జ్వరాలు, చర్మ వ్యాధులు, కలుషిత నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. అనంతరం శబరి బ్రిడ్జి వద్ద గోదావరి, శబరి నదుల ఉధృతిని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, 2022 వరదలను బట్టి 34 వేల కుటుంబాలు ప్రభావితం కానున్నట్లు తెలుస్తోందని, మొత్తం 150 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. చింతూరు ఐటీడీఏతో పాటు ప్రతి మండల తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశామని చెప్పారు. భద్రాచలం వద్ద శుక్రవారం రాత్రికి మూడో ప్రమాద హెచ్చరిక స్థాయి వరకూ గోదావరి వరద రావచ్చని, ఆ తరువాత వర్షాలు లేకుంటే తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని కలెక్టర్ అన్నారు, కార్యక్రమంలో ప్రత్యేక అధికారులు బాలకృష్ణారెడ్డి, అంబేద్కర్, వెంకటేశ్వర్లు, ఎటపాక సీఐ కృష్ణ, తహసీల్దార్ ధర్మేంద్ర, ఎంపీడీఓ ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు.
నియోజకవర్గంలో 2,39,591 మంది ఓటర్లు
రంపచోడవరం: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా రంపచోడవరం (ఎస్టీ) శాసనసభ నియోజకవర్గానికి సంబంధించిన ముసాయిదా జాబితాను శుక్రవారం ప్రచురించారు. దీనిని అన్ని పోలింగ్ కేంద్రాలు, ఏఈఆర్‌ఓ కార్యాలయాలు, గ్రామ పంచాయతీలు, ఇతర నిర్దేశిత ప్రదేశాల్లో ఉంచామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె.దినేష్ కుమార్ తెలిపారు. నియోజకవర్గంలో మొత్తం 399 పోలింగ్ స్టేషన్లు ఉండగా, ముసాయిదా జాబితా ప్రకారం 2,39,591 మంది ఓటర్లున్నారని తెలిపారు. వీరిలో పురుషులు 1,13,461, మహిళలు 1,26,115, ట్రాన్స్‌జెండర్స్ 13 మంది ఉన్నారు. సర్వీస్ ఓటర్లలో రక్షణ సేవలకు చెందిన వారు: 58 మంది ఉన్నారు. ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రజలు పరిశీలించి, మార్పులు, చేర్పులకు సంబంధించిన అభ్యంతరాలను నిర్దేశిత గడువులోగా సమర్పించాలని దినేష్ కుమార్ సూచించారు.
కాలువలోకి దూసుకెళ్లిన పర్యాటక వాహనం
మారేడుమిల్లి: మారేడుమిల్లి మండలం కుట్రవాడ సమీపంలోని సత్యసాయి వాటర్ ఇన్‌టేక్ వెల్ వద్ద శుక్రవారం ఓ పర్యాటక వాహనం అదుపు తప్పి, పాములేరు కాలువలోకి దూసుకెళ్లింది. రాజమహేంద్రవరం నుంచి విహార యాత్రకు వచ్చిన ఎనిమిది మంది యువకులు ఈ వాహనంలో ఉన్నారని తెలుస్తోంది. ప్రమాద సమాచారం తెలుసుకున్న స్థానికులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని వాహనంలోని ప్రయాణికులకు సహాయం చేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వాహనం మాత్రం స్వల్పంగా దెబ్బ తిన్నట్లు తెలుస్తోంది. ఆ పర్యాటకులు స్థానికంగా ఉన్న జేసీబీ సహాయంతో కారును బయటకు తెచ్చి తిరిగి రాజమహేంద్రవరం వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదానికి వాహనం అదుపు తప్పడమే కారణమా లేక రహదారి పరిస్థితుల వల్ల జరిగిందా అనే కోణంలో అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పాములేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వాహనం కాలువ నీటిలోకి దూసుకుపోకుండా జలాలకు చేరువగా ఒడ్డునే ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కుట్రవాడ వంతెన మలుపు వద్ద తర చూ ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇక్కడ హె చ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు, రక్షణ బ్యారికేడ్లు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.


