పరిసరాల పరిశుభ్రత, దోమల నివారణతోనే వ్యాధులకు చెక్
ఇంటింటా ర్యాపిడ్ ఫీవర్ సర్వే
డీఎంహెచ్‌వో డాక్టర్ సాధన
ఆదిలాబాద్‌టౌన్: వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో సీజనల్ వ్యాధులపై ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సాధన సూచించారు. డెంగీ, మలేరియా, వైరల్ ఫీవర్, చికున్‌గున్యా వంటి వ్యాధులు వేగంగా వ్యాపించే అవకాశం ఉందని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులు, వాంతులు వంటి లక్షణాలు ఉంటే వెంటనే సమీప ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు అంశాలపై మాట్లాడారు.
సాక్షి: సీజనల్ జ్వరాల కేసులు పెరుగుతున్నాయి. ఎలాంటి చర్యలు చేపడుతున్నారు.?
డీఎంహెచ్‌వో: వర్షాకాలంలో వైరల్ ఫీవర్, డెంగీ, మలేరియా, చికున్‌గున్యా వంటి సీజనల్ వ్యాధులు ఎక్కువగా వ్యాపిస్తాయి. ప్రస్తుతం జిల్లాలో జ్వరాల కేసులు నమోదవుతున్నప్పటికీ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. జిల్లాలో రెండు డెంగీ కేసులు నమోదయ్యాయి. వ్యాధులు ప్రబలకుండా అవసరమైన ప్రాంతాల్లో ఫాగింగ్, యాంటీ లార్వా స్ప్రేయింగ్ నిర్వహిస్తున్నాం. పాఠశాలలు, గ్రామ సభలు, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం.
సాక్షి: సీజనల్ జ్వరాలకు కారణాలు ఏంటి.?
డీఎంహెచ్‌వో: వర్షాల కారణంగా నీరు నిల్వ ఉండడం, దోమలు అధికంగా పెరగడం, కలుషితమైన నీరు తాగడం, అపరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం ద్వారా ఈ వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. డెంగీని వ్యాప్తి చేసే ఏడిస్ దోమలు మంచి నీటిలోనే పెరుగుతాయి. దీంతో ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం చాలా ఉత్తమం.
సాక్షి: వ్యాధుల నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.?
డీఎంహెచ్‌వో: ప్రతీ కుటుంబం తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, కూలర్లు, పూల కుండీలు, నీటి ట్యాంకుల్లో నీరు నిల్వ ఉండకుండా వారానికి ఒకసారి శుభ్రం చేయాలి. దోమ తెరలు ఉపయోగించాలి. తాగునీటిని మరిగించి, శుద్ధి చేసిన తర్వాతే వినియోగించాలి. వేడి, తాజా ఆహారాన్ని తీసుకోవాలి.
సాక్షి: జిల్లాలో మందులు అందుబాటులో ఉన్నాయా.?
డీఎంహెచ్‌వో: జిల్లాలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, జిల్లా ఆస్పత్రుల్లో అవసరమైన మందులు, పరీక్ష కిట్లు అందుబాటులో ఉన్నాయి. కుక్క, పాము, తేలు కాటుకు సంబంధించిన మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించాం.
సాక్షి: వ్యాధులు నిర్ధారించేందుకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు.?
డీఎంహెచ్‌వో: ర్యాపిడ్ ఫీవర్ సర్వే జూలై నుంచి సెప్టెంబర్ వరకు కొనసాగుతుంది. ఆశ కార్యకర్తలతో ఇంటింటా సర్వే చేపడుతున్నాం. ఫీవర్ టెస్టులు నిర్వహిస్తున్నాం. ప్రతీ పీహెచ్‌సీలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌ను ఏర్పాటు చేశాం. వ్యాధులు ప్రబలిన గ్రామాల్లో మెడికల్ క్యాంప్‌లు ఏర్పాటు చేస్తున్నాం.
సాక్షి: కొన్నిచోట్ల వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించడం లేదనే ఆరోపణలపై మీ స్పందన ఏంటి.?
డీఎంహెచ్‌వో: పీహెచ్‌సీలలో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించాం. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న దృష్ట్యా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించాం. విధులను విస్మరించే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.
సాక్షి: జిల్లాలో వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. ఏవిధంగా అధిగ మిస్తారు.?
డీఎంహెచ్‌వో: జిల్లాలో వైద్యుల కొరత ఉన్న మాట వాస్తవం. 26 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 18 మంది వైద్యులు పీజీకి వెళ్లడంతో కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తొమ్మిది పీహెచ్‌సీలలో వైద్యులు లేకపోవడంతో జన్‌మన్, ఆర్‌బీఎస్‌కే వైద్యులతో సర్దుబాటు చేశాం. రోగులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతున్నాం.
సాక్షి: హైరిస్క్ గ్రామాలపై ఎలాంటి దృష్టి సారించారు.?
డీఎంహెచ్‌వో: జిల్లాలో 220 హైరిస్క్ గ్రామాలను గుర్తించాం. గత ఐదేళ్లలో డెంగీ, ఇతర వ్యాధులు ప్రబలిన వాటిని గుర్తించాం. ఆయా గ్రామాల్లో ప్రతీరోజు డ్రైడే చేపడుతున్నాం. డెంగీ పాజిటివ్ వచ్చిన గ్రామాల్లో పైరిత్రీన్ స్ప్రే చేస్తున్నాం. నీరు నిల్వ ఉన్న కుంటల్లో గంబూషియా చేపలు, ఆయిల్‌బాల్స్ వేస్తున్నాం. గర్భిణీల కోసం బర్త్ వెయిటింగ్ రూమ్‌లను ఏర్పాటు చేశాం.
సాక్షి: డెంగీ లక్షణాలను ఎలా గుర్తించాలి.?
డీఎంహెచ్‌వో: అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులు, వాంతులు, ఆకలి లేకపోవడం, చర్మంపై ఎర్రటి దద్దుర్లు వంటి లక్షణాలు కనిపించవచ్చు. కొందరిలో ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో భయపడకుండా వైద్యుల సూచనలు పాటించాలి. అవసరమైతే మాత్రమే ప్రత్యేక చికిత్స అందిస్తాం. ఎలిజా ద్వారానే డెంగీ నిర్ధారణ అవుతుంది.


