చిన్నారి నోట్లో ఇరుక్కున్న టూత్‌ బ్రష్‌ | - | Sakshi
Sakshi News home page

చిన్నారి నోట్లో ఇరుక్కున్న టూత్‌ బ్రష్‌

Jul 27 2026 11:55 PM | Updated on Jul 27 2026 11:55 PM

కాసిపేట: మండలంలోని ముత్యంపల్లి గ్రామానికి చెందిన వేల్పుల సతీష్‌ కూతురు అమన్వితశ్రీ(2) నోట్లో దవడలకు టూత్‌ బ్రష్‌ చిక్కుకోవడంతో నరకయాతన అనుభవించింది. సోమవారం సాయంత్రం నోట్లో బ్రష్‌ వేసుకుని ఆడుకుంటున్న సమయంలో కిందపడడంతో చర్మాన్ని చీల్చుకుంటూ దవడలో ఇరుక్కుపోయింది. కాసిపేట పీహెచ్‌సీకి అక్కడి నుంచి 108 అంబులెన్స్‌లో మంచిర్యాల మాతాశిశు కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. వరంగల్‌ ఏంజీఎంకు తరలించాలని వైద్యులు సూచించారు. దీంతో తల్లిదండ్రులు మంచిర్యాలలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించగా.. బ్రష్‌ను తొలగించారు.

బైండోవర్‌ ఉల్లంఘించిన ఒకరికి జరిమానా

ఇచ్చోడ: బైండోవర్‌ నిబంధనలు ఉల్లఘించిన నైతం సంజీవ్‌కుమార్‌ అనే వ్యక్తికి రూ.25 వేల జరిమానా విధించినట్లు ఇచ్చోడ ఎస్‌హెచ్‌వో నరేశ్‌కుమార్‌ తెలిపారు. సోమవారం ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ముఖరా బి గ్రామానికి చెందిన నిందితుడు నైతం సంజీవ్‌కుమార్‌ గతంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నందున కేసు నమోదు చేసి బైండోవర్‌ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి మళ్లీ మద్యం విక్రయిస్తుండడంతో తహసీల్దార్‌కు నివేదిక అందజేయగా తహసీల్దార్‌ ఇమ్రాన్‌ సోమవారం ఆయనకు జరిమానా విధించినట్లు తెలిపారు.

పాము కాటుతో మహిళ మృతి

ఆదిలాబాద్‌రూరల్‌: పాముకాటుతో మండలంలోని కొత్తగూడ గ్రామానికి చెందిన గజ్జల దేవ్‌బాయ్‌ (65) అనే మహిళ మృతి చెందినట్లు ఎస్సై విష్ణువర్ధన్‌ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. దేవ్‌బాయ్‌ కుమారునితో కలిసి కొత్తగూడ గ్రామంలో నివాసం ఉంటుంది. ఆదివారం సాయంత్రం ఆమెను పాము కాటు వేసింది. రక్తస్రావం జరగడంతో కుటుంబ సభ్యులు చికిత్స కోసం 108లో రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

గంజాయి కేసులో తొమ్మిది మంది అరెస్టు

ఆసిఫాబాద్‌: పోలీసుల పెట్రోలింగ్‌లో భాగంగా తిర్యాణి మండలంలో 170 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని తొమ్మిది మందిని అరెస్టు చేశామని డీఎస్పీ అశోక్‌ తెలిపారు. జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో సోమవారం వివరాలు వెల్లడించారు. తిర్యాణి మండలం సుంగాపూర్‌ గ్రామానికి చెందిన మిడిదొడ్డి కృష్ణ, దుర్గం ప్రశాంత్‌, ఉల్లిపిట్ట గ్రామానికి చెందిన ముంజం భరత్‌ గంజాయి సేవించడంతోపాటు ఇతరులకు విక్రయిస్తున్నారని తెలిపారు. వీరి ద్వారా సుంగాపూర్‌కు చెందిన మల్కాడి కృష్ణ, ముంజం శ్రీరామ్‌, బొర్లకుంట కృష్ణంరాజు, దుర్గం జీవన్‌, వైరాగడే పుష్పరాజ్‌, చునార్కర్‌ నితిన్‌, బొర్లకుంట సాయికుమార్‌ను అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. గంజాయి వినియోగం, రవాణా నేరమని అన్నారు. ప్రత్యేక నిఘా ఉంటుందని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement