బోథ్: ఇంటి తాళం పగులగొట్టి నగదు చోరీకి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు బోథ్ ఎస్సై వి. పురుషోత్తం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 24న పట్టణంలోని న్యూ కాలనీకి చెందిన ఓ మహిళ తన ఇంటికి తాళం వేసి పనికి వెళ్లింది. సాయంత్రం తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది. ఇంట్లోని పెట్టేలో దాచుకున్న రూ.5వేల నగదు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 26న బోథ్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరడిగొండ మండలం వాగ్దారి గ్రామానికి చెందిన కృష్ణకాంత్ జాదవ్‌గా గుర్తించారు. కూలీ పని ద్వారా వచ్చే ఆదాయం సరిపోక సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో బాధితురాలి ఇంటి తాళం పగులగొట్టి చోరీ చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని ఎస్సై పేర్కొన్నారు. నిందితుడి వద్ద నుంచి రూ.5వేలు స్వాధీనం చేసుకొని, రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.


