ఆదిలాబాద్‌టౌన్: మారుతున్న నేరాల స్వరూపానికి అనుగుణంగా పోలీసు సిబ్బంది చట్టాలపై పూర్తి అవగాహన పెంపొందించుకొని ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. సోమవారం పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో సివిల్ పోలీసు కానిస్టేబుళ్లకు మూడు రోజుల రిఫ్రెషర్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 600 మంది సివిల్ పోలీసు కానిస్టేబుళ్లకు 30 బ్యాచ్‌లుగా శిక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బేసిక్ పోలీసింగ్‌తో పాటు ప్రో యాక్టివ్ పోలీసింగ్‌ను సమర్థవంతంగా అమలు చేస్తూ నేరాల నివారణలో కీలకపాత్ర పోషించాలని పేర్కొన్నారు. శిక్షణలో దర్యాప్తు ప్రమాణాలు, డయల్100 సేవల నిర్వహణ, రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్ల పర్యవేక్షణ, నూతన బీట్ సిస్టం, ఆయుధాల వినియోగం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వేలిముద్రల సేకరణ వంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పించనున్నట్లు వివరించారు. క్రమశిక్షణ, నీతి, నిజాయితీతో విధులు నిర్వహిస్తూ ప్రజలతో సత్సంబంధాలు పెంపొందించుకోవాలని సూచించారు. అదనపు ఎస్పీ పి.మౌనిక, ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, డీసీఆర్‌బీ ఎస్సై ప్రవీణ్, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజా సమస్యలు బాధ్యతగా పరిష్కరించాలి
ఆదిలాబాద్‌టౌన్: ప్రజా సమస్యలను బాధ్యతగా స్వీకరించి, చట్టపరంగా సత్వర పరిష్కారం కోసం అధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 28 మంది ఫిర్యాదుదారుల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. ఫిర్యాదులను పరిశీలించి సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు గమనిస్తే వెంటనే 87126 59973 నంబర్‌కు వాట్సాప్ ద్వారా సమాచారం అందించాలని కోరారు. సీసీ కొండ రాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారి జైస్వాల్ కవిత, సిబ్బంది సునీల్ తదితరులు పాల్గొన్నారు.


