ఇది బోథ్ సబ్ డివిజన్ ఆర్‌అండ్‌బీ శాఖ కార్యాలయంలోని డీఈ కుర్చీ. కొంతకాలంగా ఖాళీగా దర్శనమిస్తోంది. ఈ కార్యాలయంలో ముగ్గురు కిందిస్థాయి సిబ్బంది విధులకు హాజరవుతున్నా.. డీఈ, ఏఈఈ వంటి వారు మాత్రం ఇటు వైపు రావడం లేదని స్థాని కులు చెబుతున్నారు. ప్రధాన రహదారు ల నిర్మాణాలు, ప్రభుత్వ భవనాల మరమ్మతు పనులను అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన అధి కారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఆదిలాబాద్ కార్యాలయాని కే పరిమితమవుతున్నట్లుగాతెలుస్తోంది.
బోథ్: వారు పేరుకే బోథ్ నియోజకవర్గ కేంద్రంలో విధి నిర్వహణ. అయితే నిత్యం జిల్లా కేంద్రం నుంచే పాలన సాగిస్తున్నారు. చుట్టపుచూపుగా వస్తూ ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తున్నారని పలు వి భాగాల ఇంజినీర్లు విమర్శలు ఎదుర్కొంటున్నారు. నియోజకవర్గ కేంద్రంలో ప్రజా సమస్యల వేగవంతమైన పరిష్కారం, అభివృద్ధి పనుల ప్రత్యక్ష పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన పలు ఇంజినీరింగ్ కా ర్యాలయాలు అధికారుల అందుబాటులో లేక వెలవెలబోతున్నాయి. ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, నీటిపారుదల, గ్రామీణ నీటి సరఫరా శాఖ వంటి కీలకమైన విభాగాల్లో పనిచేసే ఇంజినీర్లు బోథ్ కేంద్రంగా అందుబాటులో ఉండి విధులు నిర్వహించాలి. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం విరుద్ధంగా మారింది. సంబంధిత అధికారులు ఇక్కడికి రాకుండా జిల్లా కేంద్రంలో ఉండి మమ అనిపిస్తుండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో చేపట్టిన పనులు, వాటి నాణ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన అధికారులు అవేమీ చూడకుండానే, ఎంబీ కొలతలు ఇంట్లోనే కూర్చుండి రాస్తున్నారనే ఆరోపణలున్నాయి.
ఆదిలాబాద్‌కే రమ్మంటున్న ఇంజినీర్లు..
స్థానికంగా కార్యాలయాల్లో మౌలిక వసతులు ఉన్నా అధికారులు ఇక్కడ విధులకు హాజరుకాకపోవడం గమనార్హం. సంతకాలు, రికార్డుల పరిశీలన, బిల్లుల ఆమోదం కోసం కాంట్రాక్టర్లను ఆదిలాబాద్ లోని కార్యాలయాలకు రమ్మంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఆయా విభాగాల అధికారులు నియోజకవర్గ కేంద్రంలోనే అందుబాటులో ఉండి విధులకు హాజరయ్యేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు.


