● జిల్లాలో రైల్వే ప్రగతిపై శీతకన్ను ● డీపీఆర్‌కే పరిమితమైన ‘ఆదిలాబాద్ – హైదరాబాద్’ ● కొత్త లైన్ల కేటాయింపులోనూ అన్యాయం ● నిర్మాణ పనుల పురోగతిలో సైతం అలసత్వమే.. ● ఆదిలాబాద్–హైదరాబాద్ రైల్వేమార్గం డిమాండ్ దశాబ్దాలుగా కొనసాగుతున్నా ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఫలితంగా జిల్లా ప్రజలు రాష్ట్ర రాజధానికి వెళ్లేందుకు ఎక్కువగా బస్సులనే ఆశ్రయించాల్సి వస్తోంది. ఆదిలాబాద్ నుంచి నడిచే కృష్ణా ఎక్స్‌ప్రెస్ మహారాష్ట్రలోని ముద్ఖేడ్ జంక్షన్ మీదుగా నిజామాబాద్ చేరుకుని అక్కడి నుంచి హైదరాబాద్‌కు వెళ్తుంది. ఫలితంగా ప్రయాణికులు సుమారు 120 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆర్మూర్–నిర్మల్–ఆదిలాబాద్ మీదుగా 136.50 కిలోమీటర్ల రైల్వే మార్గానికి సుమారు రూ.4,300 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ సిద్ధమైనప్పటికీ ప్రాజెక్టుకు మోక్షం లభించకపోవడం గమనార్హం.
● ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని తూర్పు–దక్షిణ ప్రాంతాలను అనుసంధానానికి తోడ్పడే కీలకమైన ఆదిలాబాద్–గడ్‌చందూర్ రైల్వేలైన్ కూడా జిల్లా నుంచి దూరమైంది. 2009–10 ఆర్థిక సంవత్సరంలో ఈ నూతన మార్గానికి ఆమోదం లభించింది. అమలైతే జిల్లాలోని బేల, జైనథ్ మండలాల ప్రజలకు రైల్వే ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చేది. అయితే ఈ నెల 8న గడ్‌చందూర్–ముకుట్‌బన్ 38.21 కిలోమీటర్ల నూతన మార్గం కోసం భూసేకరణ చేపట్టేందుకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో జిల్లా ప్రజలకు నిరాశే మిగిలినట్లయింది.
ఆదిలాబాద్: ఆదిలాబాద్‌పై రైల్వే కేటాయింపుల్లో దశాబ్దాలుగా నిర్లక్ష్యం కొనసాగుతోంది. జిల్లా ప్ర జల చిరకాల వాంఛ అయిన ఆదిలాబాద్–హైదరా బాద్ రైల్వే లైన్ ఇప్పటికీ కార్యరూపం దాల్చకపోగా, ఇటీవల ప్రతిపాదిత ముకుట్‌బన్ కూడా జిల్లాకు దూరమవడం నిరాశ కు గురిచేసింది. కొత్త మా ర్గాల అభివృద్ధిని పక్కనబెడితే ఇప్పటికే ఉన్న ఆది లాబాద్ రైల్వే స్టేషన్‌లోనూ ఆధునికీకరణ పనులు, ప్రయాణికులకు అవసరమైన మౌలిక వసతుల కల్పన ఆశించిన స్థాయిలో జరగడం లేదు. సరిపడా రైళ్ల సౌకర్యం లేకపోవడం, అనుసంధాన సేవలు బ లహీనంగా ఉండటంతో జిల్లావాసులు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
కొత్త పట్టాలపై పట్టింపు కరువు..
ఆయా రామ్.. గయా రామ్
జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న రైల్వే అభివృద్ధి పనులను అధికారులు అడపాదడపా తనిఖీ చేస్తున్నారు. పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ వాటి అమలుపై నిరంతర పర్యవేక్షణ లేకపోవడంతో నత్తనడకన సాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తేనే పనులు త్వరితగతిన పూర్తవుతాయనే అభిప్రాయాలు జిల్లా వాసుల నుంచి వ్యక్తమవుతున్నాయి.