నిర్మల్‌ఖిల్లా: రాష్ట్రంలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు ప్రభుత్వం మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ అవకాశం కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ప్రధానంగా ఎస్జీటీలు, భాషా పండితులు, పీఈటీలు, ఇతర కేటగిరీల టీచర్లకు ఉపశమనం కలిగింది. చాలామంది ఇప్పటికే పరీక్షకు సిద్ధమవుతూ పుస్తకాల కొనుగోలు, శిక్షణ, స్వీయ అధ్యయనంపై దృష్టి సారించారు. ప్రత్యేక టెట్ నిర్వహించనున్నా అర్హత మార్కుల్లో ఎలాంటి మార్పు చేయలేదు. సాధారణ టెట్‌కు వర్తించే కనీస అర్హత మార్కులనే దీనికి వర్తింపజేస్తారు. దీంతో పరీక్షలో ఉత్తీర్ణత సాధనకు ఉపాధ్యాయులు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ప్రత్యేక టెట్ కాబట్టి అర్హత మార్కులను కొంత సడలిస్తారని ఆశించిన కొందరు ఉపాధ్యాయులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల పరిధిలో మొత్తం 11 వేలకు పైగా ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాలల్లో ఉపాధ్యాయులుండగా 4 వేల మందికి పైగా టెట్ అర్హత సాధించాల్సి ఉంది. మరోవైపు పదోన్నతి కోసం కూడా పేపర్–2 పరీక్ష అర్హత సాధించాల్సి ఉంటుంది. 150 మార్కుల ప్రశ్నపత్రంలో జనరల్ అభ్యర్థులు 60 శాతం, బీసీలు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 40 శాతం మార్కులు సాధించాలి.
పదోన్నతులకు కీలకం
భవిష్యత్‌లో చేపట్టే పదోన్నతులు, స్కూల్ అసిస్టెంట్, తదితర ఉన్నత పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకాశం లభించనుండడంతో ఈ పరీక్షకు ప్రాధాన్యం ఏర్పడింది. అందుకే జిల్లాలోని ఉపాధ్యాయులు దీనిని అత్యంత కీలకంగా భావిస్తున్నారు. పేపర్–2 అర్హత సాధించడం ద్వారా ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్‌గా, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి పొందేందుకు వీలు కలుగుతుంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఉపాధ్యాయుని కేడర్‌ను బట్టి కూడా ఈ అర్హత తప్పనిసరి చేసింది.
పరీక్షల షెడ్యూల్ ఇలా....
దరఖాస్తుల స్వీకరణ: ఈనెల 22 నుంచి 29 వరకు
ఆన్‌లైన్ ద్వారా సీబీటీ పరీక్షలు: సెప్టెంబర్ 7 నుంచి 11వరకు
ఫలితాల వెల్లడి: సెప్టెంబర్ 28 నుంచి 30 తేదీలలో..


