ఉట్నూర్‌రూరల్: ఎవరెస్టు శిఖరంపై జాతీయ పతాకాన్ని ఎగురవేసే అవకాశం జిల్లాకు చెందిన ఇద్దరు పర్వతారోహకులకు రావడం అభినందనీయమని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బుధవారం ఉట్నూర్ కేబీ కాంప్లెక్స్ నుంచి ఎవరెస్టు శిఖర అధిరోహణకు బయలుదేరుతున్న మడావి కన్నీబాయి, కొట్నక్ ఆనందరావును సత్కరించి సాగనంపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కన్నిబాయి మూడోసారి వెళ్తుండడం ఆమె పట్టుదలకు నిదర్శనమన్నారు. వారిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అనంతరం మండలంలోని శాంతినగర్‌లో ‘నంది ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వజ్రం ప్యూర్ ఫైర్‘ శుద్ధ జల కేంద్రాన్ని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుతో కలిసి ప్రారంభించారు. పెద్ద సుద్దగూడ, గంగాపూర్ గ్రామాలతో పాటు మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల పనుల పురోగతిని పరిశీలించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గిరిజన సంక్షేమ బాలికల హాస్టల్‌ను తనిఖీ చేశారు. ‘తెలంగాణ జలసిరి’ కార్యక్రమా అమలులో భాగంగా గంగాపూర్‌లో నీటికుంటల నిర్మాణాన్ని ప్రారంభించారు. మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ‘పోషకాహార తోట‘ను ప్రారంభించి మొక్కలు నాటారు. ఆయా కార్యక్రమాల్లో ఐటీడీఏ ఏపీవోలు దశరథ్, డి.వసంతరావు, ఆత్రం భాస్కర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రవీందర్, ఆర్డీవో రాథోడ్ మోహన్ సింగ్, గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, తదితరులు పాల్గొన్నారు.


