బాసర: ఆధునిక సాంకేతికతను సమర్థంగా వినియోగించి విద్యార్థులను ప్రపంచ స్థాయి ఉద్యోగాలు సాధించేలా సిద్ధం చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. బుధవారం ఆర్జీయూకేటీ క్యాంపస్‌ను సందర్శించారు. అనంతరం విశ్వవిద్యాలయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, పరిశ్రమలకు అవసరమైన సామర్థ్యాలను పెంపొందించేలా విద్యా ప్రణాళికలు రూపొందించాలన్నారు. విద్యతో పాటు విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్థుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, క్యాంపస్ అభివృద్ధికి జిల్లా యంత్రాంగం నుంచి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయ నిర్మాణానికి ఎంపిక చేసిన స్థలాన్ని పరిశీలించారు. సమావేశంలో భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్, ఓఎస్డీ మురళీ దర్శన్, తహసీల్దార్ పవన్ చంద్ర, తదితరులు పాల్గొన్నారు.


