మట్టిపాలైన 90 క్వింటాళ్ల బియ్యం | - | Sakshi
Sakshi News home page

మట్టిపాలైన 90 క్వింటాళ్ల బియ్యం

Jul 22 2026 11:29 AM | Updated on Jul 22 2026 11:29 AM

● ఫుడ్‌ పాయిజన్‌ ఘటనతో బియ్యం, వంట సామగ్రి సీజ్‌ ● పాడైపోవడంతో పూడ్చిపెట్టిన పంచాయతీ సిబ్బంది

వాంకిడి: అధికారుల నిర్లక్ష్యంతో రూ.లక్షల విలువ చేసే బియ్యం, తదితర సరుకులు మట్టిపాలయ్యాయి. వాంకిడి మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో 2024 నవంబర్‌లో జరిగిన ఫుడ్‌ పాయిజన్‌ ఘటనలో 60 మందికి పైగా విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఒక విద్యార్థిని చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం అధికారుల విచారణ నేపథ్యంలో స్టోర్‌ రూంలో నిల్వ ఉన్న బియ్యం, నూనె, తదితర వంట సరుకులను సీజ్‌ చేశారు. ఆ తర్వాత వాటిని పట్టించుకునే వారు లేకపోవడంతో సుమారు రెండేళ్లుగా స్టోర్‌ రూముకే పరిమితమయ్యాయి. ఇటీవల సరుకులు నిల్వ ఉంచేందుకు ఇబ్బందిగా మారుతుందని హాస్టల్‌ సిబ్బంది అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సోమవారం ఆర్‌ఐ(గిర్దావార్‌) శైలజ సమక్షంలో పంచనామా నిర్వహించారు. 90 క్వింటాళ్ల బియ్యం, మూడు కాటన్ల వంట నూనె, కారం, తదితర సరుకులు పూర్తిగా పాడైపోయినట్లు గుర్తించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాటిని కొలాప్స్‌ చేసేందుకు నిర్ణయించగా పంచాయతీ సిబ్బంది మంగళవారం వాంకిడి డంపింగ్‌ యార్డులో జేసీబీతో గుంత తవ్వి పూడ్చివేశారు. కాగా, ఫుడ్‌ పాయిజన్‌ ఘటన అనంతరం అధికారులు విద్యార్థినుల అస్వస్థతకు గల కారణాలపై అనేక రకాలుగా విచారణ చేపట్టారు. ఇందులో భాగంగానే స్టోర్‌ రూమ్‌లోని వంట సరుకులు, బియ్యం, కారం, తదితర సామగ్రి శాంపిల్స్‌ సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు తరలించినట్లు అప్పట్లో అధికారులు తెలిపారు. కానీ ఆ సరుకుల్లో విష పదార్థాలు ఉన్నాయా లేవా అనేది బయటికి రాలేదు. ఆ సరుకులు విషపూరితమైతే ఇన్ని రోజులు స్టోర్‌ రూములో ఎందుకు ఉంచాల్సి వచ్చింది.. మంచివే అయితే ఎందుకు వినియోగించ లేదనే ప్రశ్నలు వెల్లువెత్తునున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement