ఆదిలాబాద్‌టౌన్: వ్యవసాయ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిస్తూ ట్రాన్స్‌ఫార్మర్లను దొంగిలిస్తున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. స్థానిక పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ ముఠాకు చెందిన ఎనిమిది మందిపై ఆదిలాబాద్‌రూరల్, మావల పోలీస్‌స్టేషన్ల పరిధిలో 10 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఏడాదిగా ట్రాన్స్‌ఫార్మర్లను దొంగిలిస్తున్న ముఠాపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు పేర్కొన్నారు. ఇందుకోసం రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అరెస్టు చేసిన నిందితుల్లో జాదవ్ సంతోష్, మీరాల సంతోష్, మండ్వాకర్ నవ్వడు అలియాస్ నవనాథ్‌తో పాటు ఒక బాల నేరస్తుడు ఉన్నట్లు పేర్కొన్నారు. మరో నిందితుడు సరేళా రవి పరారీలో ఉన్నట్లు వివరించారు. దొంగిలించిన రాగి తీగలను కొనుగోలు చేసిన షేక్ అఫ్రోజ్, అబ్దుల్ నౌషీర్‌ను కూడా అరెస్టు చేయగా, టిటిల్ కరణ్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితులు రాత్రి వేళల్లో ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి వాటిలోని రాగి తీగలను తీసి తక్కువ ధరకు స్క్రాప్ దుకాణాలకు విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. ఆ యజమానులు దొంగలతో కుమ్మకై ్క చోరీలకు ప్రోత్సహించినట్లు విచారణలో తేలిందన్నారు. నిందితుల నుంచి ఎనిమిది ట్రాన్స్‌ఫార్మర్లు, రెండు 5 హెచ్‌పీ మోటార్ల నుంచి తీసిన సుమారు రూ.1.50 లక్షల విలువ గల వంద కిలోల రాగి తీగ, రెండు మొబైల్ ఫోన్లు, రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. గతంలో కూడా ఇదే ముఠా జైనథ్ ప్రాంతంలో దొంగతనాలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చినట్లు చెప్పారు. కేసును ఛేదించడంలో కీలకంగా పనిచేసిన రూరల్ సీఐ రహీం పాషా, ఎస్సై విష్ణువర్ధన్, పోలీసు సిబ్బంది మంగళ్ సింగ్, అబ్దుల్ కరీంను ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి, రూరల్ సీఐ రహీం పాషా, ఎస్సై విష్ణువర్ధన్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


