చింతలమానెపల్లి: మహారాష్ట్ర సరిహద్దులోని కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మీదుగా పట్టణాలు, నగరాలకు పశువుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడడం లేదు. తాళ్లతో కట్టి ప్యాసింజర్ వాహనంలో తరలిస్తున్న పశువులను మంగళవారం చింతలమానెపల్లి మండలం ఖర్జెల్లి సమీపంలో పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై కమలాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఖర్జెల్లి సమీపంలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా అదే మార్గంలో వస్తున్న ఒక మహింద్రా జైలో ప్యాసింజర్ వాహనం డ్రైవర్ పోలీసులను గమనించి కొంత దూరంలో నిలిపివేశాడు. డ్రైవర్ దిగి పారిపోవడం గమనించిన పోలీసులు వాహనాన్ని తనిఖీ చేశారు. తప్పుడు నంబర్ ఉండటంతోపాటు తాళ్లతో కట్టేసిన ఒక ఆవు, ఒక ఎద్దు, ఐదు దూడలను గుర్తించారు. పశువులను అక్రమంగా కబేళాకు తరలిస్తున్నట్లుగా నిర్ధారించారు. వాహనాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించి పారిపోయిన డ్రైవర్‌పై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


