కలమడుగులో మాయం.. ఆసిఫాబాద్‌లో ప్రత్యక్షం | - | Sakshi
Sakshi News home page

కలమడుగులో మాయం.. ఆసిఫాబాద్‌లో ప్రత్యక్షం

Jul 20 2026 11:36 PM | Updated on Jul 20 2026 11:36 PM

● తండ్రికి తెలియకుండా పిల్లలను తీసుకెళ్లిన తల్లి ● క్షేమంగా ఉన్నట్లు గుర్తించిన పోలీసులు

జన్నారం: తండ్రికి తెలియకుండా పిల్లలను తల్లి తనతో తీసుకెళ్లడంతో తండ్రితో పాటు పోలీసులు, గ్రామస్తులు హైరానా పడిన ఘటన మండలంలోని కలమడుగులో సోమవారం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఎస్సై ఉదయ్‌కిరణ్‌ తెలిపారు. గుడిహత్నూర్‌కు చెందిన వెలాడి సంతోష్‌కుమార్‌ కరీంనగర్‌లో ఉంటున్నాడు. సోమవారం తన ముగ్గురు పిల్లలతో కలిసి కరీంనగర్‌ నుంచి గుడిహత్నూర్‌కు బయల్దేరాడు. జన్నారం మండలం కలమడుగు వరకు వచ్చిన తర్వాత మధ్యాహ్నం రెండు గంటల సమయంలో దస్తురాబాద్‌ రోడ్డులో ఆటో కోసం ఎదురు చూస్తున్నారు. అక్కడే ఉన్న బెంచీలపై పిల్లలను కూర్చోబెట్టి బయటకు వెళ్లి వచ్చే సరికి పిల్లలు కనిపించలేదు. వెంటనే విషయాన్ని పోలీసులకు ఫోన్‌ ద్వారా సమాచారం ఇవ్వడంతో ఎస్సై ఉదయ్‌కిరణ్‌ కలమడుగుకు చేరుకుని వివరాలు సేకరించారు. పోలీసులతో పాటు గ్రామస్తులు సైతం పిల్లల కోసం వెతికారు. గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించినా ఆచూకీ దొరకలేదు. పోలీసులు పిల్లల కోసం వెతుకుతూ దస్తురాబాద్‌ వైపు వెళ్లారు. అక్కడ గొండుగూడకు చెందిన పెద్దలను విచారించగా పిల్లలను వారి తల్లి వెలాడి దేవేంద్ర తన పుట్టిళ్లు ఆసిఫాబాద్‌కు తీసుకెళ్లినట్లు తెలిపారు. దీంతో ఎస్సై వెంటనే దేవేంద్రకు ఫోన్‌ చేసి మాట్లాడారు. తన భర్త సంతోష్‌తో గొడవ కారణంగా పది రోజుల నుంచి ఆయనకు దూరంగా ఉంటున్నానని ఆమె పేర్కొంది. తన పిల్లలు కలమడుగులో ఉన్నట్లు తెలియడంతో అక్కడికి వచ్చి తండ్రికి తెలియకుండా వారిని తన వెంట తీసుకెళ్లినట్లు దేవేంద్ర అంగీకరించింది. దీంతో తండ్రి, గ్రామస్తులతో పాటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement