ఉట్నూర్‌రూరల్: గిరిపుత్రులు చదువుతో పాటు క్రీడల్లోనూ ముందుండాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక పరిశీలకుడు హేమంత్‌కుమార్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని గిరిజన క్రీడా పాఠశాలను సందర్శించారు. ఆయన మాట్లాడుతూ ఆహారం, నిద్ర, నీరు తగినంతగా ఉండాలని సూచించారు. పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణించడం అభినందనీయమన్నారు. అనంతరం క్రీడల్లో రాణిస్తున్న పాఠశాల విద్యార్థులను సత్కరించారు. ఏపీవో పీవీటీజీ ఆత్రం భాస్కర్, డిప్యూటీడీఈఓ గోడం చందన్, జేడీఏ నాగభూషణం, జిల్లా క్రీడల అధికారి కె.పార్థసారథి, హెచ్‌ఎం ఆర్.ఉత్తం, హెచ్‌డబ్ల్యూవో మెస్త్రం గంగారాం, కోచ్‌లు శివకృష్ణ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు ఐటీడీఏ పీవో మంద మకరందును కలిసి పలు విషయాలపై చర్చించారు. అనంతరం మహువా లడ్డూ తయారీ, తదితర ప్రాంతాల్లో పర్యటించారు.
ఇంద్రవెల్లి: కేస్లాపూర్ నాగోబా ఆలయంలో సోమవారం మానవ హక్కుల కమిషన్ ప్రత్యేక పర్యవేక్షణ అధికారి హేమంత్‌కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా మెస్రం వంశీయులు శాలువాతో ఆయనకు సన్మానం చేశారు. నాగోబా ఆలయాభివృద్ధి, నాగోబా చరిత్ర, నాగోబా జాతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి ఇంద్రవెల్లి ఐఎఫ్‌పీసీఎల్ జిన్నింగ్ మిల్లును సందర్శించారు. అనంతరం ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపాన్ని సందర్శించి అమరులకు నివాళులర్పించారు. ఆశ్రమ పాఠశాలను సందర్శించి తరగతి గదిలో విద్యార్థినులతో కలిసి ఉపాధ్యాయుల బోధన తీరు పరిశీలించారు. ట్రైకార్ డీజీఎం రవికుమార్, ఐటీడీఏ పీవీటీజీ ఏపీవో ఆత్రం భాస్కర్, జేడీఎం నాగభూషణం, నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.


