కౌటాల: పంటల్లో కలుపుతీత కోసం కూలీలు దొరక్క రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రైతుల కష్టాలను దూరం చేసేందుకు ఒక యువరైతు వినూత్నంగా ఆలోచించాడు. మండలంలోని పార్డీ గ్రామానికి చెందిన యువరైతు తొర్రె శ్రీకాంత్ 7వ తరగతి వరకు చదువుకొని వ్యవసాయం చేస్తున్నాడు. శ్రీకాంత్ ప్రస్తుతం సిర్పూర్(టి) మండలం హుడ్కులి గ్రామంలో ఉంటూ తన మూడు ఎకరాల చేనులో పత్తి పండిస్తున్నాడు. ఏటా తన చేనులో కలుపును నిర్మూలించేందుకు పంటకాలంలో నాలుగుసార్లు దౌర కొట్టడానికి రూ. 8వేలు ఖర్చు చేసేవాడు. కొన్నిసార్లు దౌరలు, కూలీల కొరతతో పంటలో కలుపు తీయడం కష్టంగా మారింది. ఈ క్రమంలో కలుపు ఖర్చును తగ్గించుకోవడంతో పాటు కూలీలు, అరకలపై ఆధారపడకుండా ఉండేందుకు పాత బైక్ ఇంజిన్‌ను వినియోగించి కలుపుతీత యంత్రాన్ని తయారు చేశాడు. రూ.4వేలతో పాత బైక్ ఇంజిన్‌ను కొనుగోలు చేసి ఇంజిన్‌కు చైన్‌సిస్టమ్‌ను అనుసంధానం చేసి 1.5 లీటర్ల పెట్రోల్ ట్యాంకును అమర్చి యంత్రాన్ని సిద్ధం చేశాడు. రూ. 9 వేల వ్యయంతో తయారు చేసిన యంత్రం మూడెకరాల పత్తి చేనులోని కలుపును కేవలం రెండు రోజుల్లో రూ.600 పెట్రోల్ ఖర్చుతో పూర్తి చేసిందని శ్రీకాంత్ తెలిపాడు. యువరైతు సృజనాత్మకతతో తయారు చేసిన కలుపు యంత్రం పనితీరును రైతులు ఆసక్తిగా చూసి ఆయనను అభినందిస్తున్నారు.


