ఆదిలాబాద్‌రూరల్: నలుగురు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సోమవారం మావల పోలీస్‌స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది జనవరి 18న ఆదర్శ్‌నగర్‌లో తాళం వేసి ఉన్న ఇంట్లోకి చొరబడి గుర్తుతెలియని వ్యక్తులు బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదు అపహరించారు. కేసు నమోదు చేసుకున్న మావల పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి సీసీటీవీ ఫుటేజీ, సాంకేతిక ఆధారాలు, క్షేత్రస్థాయి సమాచారంతో దర్యాప్తు చేపట్టారు. మహారాష్ట్రకు చెందిన దొంగల ముఠా షిండే సునీల్ అలియాస్ రాకీ, కుమ్రే సుజల్ యురాజ్, మార్జివే శేఖర్, గైక్వాడ్ లక్ష్మణ్‌లను నిందితులుగా గుర్తించారు. వారిని అరెస్ట్ చేయడంతో పాటు వారి వద్ద నుంచి 36 గ్రాముల బంగారం, 25.5 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో వీరు మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదర్శ్‌నగర్, టైలర్స్ కాలనీల్లో జరిగిన పలు ఘటనల్లో పాల్గొన్నట్లు అంగీకరించారు. తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల్లో నమోదైన ఇతర చోరీ కేసుల్లోనూ వీరి ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోందని ఎస్పీ తెలిపారు. ప్రధాన నిందితుడు షిండే సునీల్‌పై మహారాష్ట్రలోని వార్ధా, యవత్మాల్ జిల్లాల్లో ఎనిమిది దొంగతనం కేసులు, మరో నిందితుడు కుమ్రే సుజల్‌పై మూడు కేసులు నమోదైనట్లు వివరించారు. సమావేశంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి, మావల సీఐ ప్రేమ్‌కుమార్, ఎస్సై రాజశేఖర్‌రెడ్డి, పోలీసు సిబ్బంది షబ్బీర్, సట్ల శ్రీను, జాకీర్ తదితరులు పాల్గొన్నారు.


