గుడిహత్నూర్: గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ) ప్రకారం కార్యాచరణ రూపొందించాలని పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ నరసింహులు అన్నారు. స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో సర్పంచ్‌లు, అధికారులు, పంచాయతీ కార్యదర్శులకు సోమవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామ పంచాయితీ ప్రగతి దిశగా సాగాలంటే ఎలాంటి ప్రణాళికలు అవసరమో వాటిని స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారంతో రూపొందించి నివేదికలు పంపాలని సూచించారు. పల్లెల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడం ద్వారానే ఆశించిన అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఇందుకోసం అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. గ్రామాభివృద్ధిలో ప్రతి పౌరుడిని భాగస్వాములను చేయాల్సిన బాధ్యత సర్పంచులు, కార్యదర్శులదేనని స్పష్టం చేశారు. పనితీరులో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎంపీడీవో మాణిక్ ప్రభు, ఎంపీవో దిలీప్‌కుమార్, ఏవో భగత్ రమేశ్, ఎంఈవో గోపాల్ సింగ్ తిలావత్, కార్యదర్శులు పాల్గొన్నారు.


