ఆదిలాబాద్‌టౌన్: బాధితుల సమస్యలు సత్వరమే పరిష్కరించి ప్రజల విశ్వాసం చూరగొనాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌డేలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారి నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 49 మంది తమ సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకురాగా, ప్రతీ ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. దర్యాప్తు చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకుని త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పోలీసు వ్యవస్థ ఎల్లప్పుడూ బాధితుల పక్షాన నిలబడి న్యాయం చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు. కార్యక్రమంలో సీసీ కొండరాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారి జైస్వాల్ కవిత, సిబ్బంది వామన్, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.


