● కలెక్టర్ రాజర్షిషా
ఆదిలాబాద్‌టౌన్: భూభారతిలో భాగంగా గ్రామాల్లో చేపట్టిన భూముల రీసర్వే గడువులోపు పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. కలెక్టర్ సమావేశ మందిరంలో సర్వే పురోగతిపై శనివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి పారదర్శకమైన భూరికార్డుల కోసం ప్రభుత్వం ఈ ప్రక్రియ చేపడుతుందని తెలిపారు. అధికారులు నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. డ్రోన్ సర్వే పూర్తయిన గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్, గ్రౌండ్ వాలిడేషన్ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. సర్వేలో సాంకేతిక లోపాలతో పాటు సమస్యలను క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆర్డీవో, ల్యాండ్ సర్వే ఏడీలను ఆదేశించారు. రైతుల నుంచి వచ్చే అభ్యంతరాలు, వినతులను పారదర్శకంగా పరిష్కరించాలన్నారు. ప్రతి గ్రామంలో సరిహద్దు గుర్తింపులు పక్కాగా జరగాలని, సర్వే రికార్డులు డిజిటలైజేషన్ చేయాలని, ఎక్కడ తప్పులు దొర్లకుండా చూడాలన్నారు. సమావేశంలో ఆర్డీవో జగదీశ్వర్‌రావు, ల్యాండ్ సర్వే రికార్డ్స్ ఏడీ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.


