ఆదిలాబాద్‌టౌన్: ప్రతీ పేద కుటుంబానికి మెరుగైన వైద్య సేవలు అందించి ఆదిలాబాద్‌ను ఆరోగ్యవంతమైన జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి సాధన పేర్కొన్నారు. గు రువారం జిల్లా కేంద్రంలోని కేర్ అండ్ సపోర్ట్ సెంటర్‌లో నెట్‌వర్క్ ఆఫ్ హెల్పింగ్ పూర్, షూర్, వై ఆర్‌జీ లింక్ వర్కర్స్ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో హెచ్‌ఐవీతో జీవిస్తున్న కుటుంబాల్లో హెచ్‌ఐవీ లేని 25మంది చిన్నారులకు పుస్తకాలు, బ్యాగులు, పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. హెచ్‌ఐవీతో జీవిస్తున్న కుటుంబాల పిల్లలకు విద్య ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. విద్యతోనే ఉన్నత స్థా యికి చేరుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ ఏఆర్‌టీ కేంద్రాల ద్వారా బాధితులకు ఉ చితంగా మందులు అందించడంతో పాటు దాతల సహకారంతో పిల్లలకు విద్యా సామగ్రి అందిస్తున్నట్లు పేర్కొన్నారు. నాకో, తెలంగాణ రాష్ట్ర ఎయి డ్స్ నియంత్రణ మండలి నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించి ఆదిలాబాద్‌ను హెచ్‌ఐవీ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. హెచ్‌ఐవీతో జీవిస్తున్న చిన్నారుల విద్యకు పూర్తి సహకారం అందిస్తామని, వారికి ఉన్నత విద్యతో పాటు పెద్దలకు ఆసరా పింఛనుఅందించేందుకు ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామని హామీ ఇచ్చారు. జిల్లా ఎయిడ్స్ నివారణ, నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు, అవసరమైన వారికి ఉచిత హెచ్‌ఐవీ పరీక్షలు, బాధితులకు ఉచిత మందుల పంపిణీ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నట్లు తెలిపారు. ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతిఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. జిల్లా ఎయిడ్స్ అండ్ లెప్రసీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఈశ్వర్‌రాజ్, ఏఆర్‌టీ సెంటర్ వైద్యురాలు పద్మిని, ప్రియదర్శిని, సీపీఎం నాగరాజు, ఎన్జీవో ప్రతినిధులు సాయినాథ్, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


