బాబ్బాబు.. మా కాలేజీలో చేరండి | - | Sakshi
Sakshi News home page

బాబ్బాబు.. మా కాలేజీలో చేరండి

Apr 13 2026 8:02 AM | Updated on Apr 13 2026 8:02 AM

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విస్తృత ప్రచారం వందశాతం సీట్ల భర్తీకి సర్కారు ఆదేశం విద్యార్థుల ఇళ్ల బాట పట్టిన అధ్యాపకులు

ఆదిలాబాద్‌టౌన్‌: కార్పొరేట్‌, ప్రైవేట్‌ కళాశాలలు ప్రవేశాల కోసం ప్రచారం నిర్వహించడం పరిపాటి. కానీ ఇందుకు భిన్నంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు ప్రవేశాల కోసం విస్తృతంగా ప్రచారం చేస్తుండటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇటీవల ఇంటర్మీడియెట్‌ పరీక్షలు జరిగిన సమయంలో ఆయా కేంద్రాల వద్దకు వెళ్లి తమ కళాశాలల్లో చేరాలంటూ విద్యార్థులకు బ్రోచర్లు అందజేస్తూ కళాఽశాల ప్రత్యేకతను వివరించారు. ప్రభుత్వ కళాఽశాలకు కేటాయించిన సీట్లను పూర్తిస్థాయిలో భర్తీ చేయాలని కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ యోగితా రాణా ఆదేశాలు జారీ చేశారు. నెల రోజులుగా ఈ ప్రక్రియ జరుగుతుండగా ప్రస్తుతం ప్రచారం ముమ్మరం చేశారు. అధ్యాపకులు విద్యార్థుల ఇళ్ల బాట పడుతున్నారు. తల్లిదండ్రులకు సర్కారు కళాశాలల ప్రాధాన్యతపై అవగాహన కల్పిస్తూ తమ పిల్లలను చేర్పించాలని కోరుతున్నారు. వీరితో పాటు గ్రామాల్లోని సర్పంచ్‌లు, పట్టణాల్లోని కౌన్సిలర్లను కలుస్తూ సహకరించాలని విజ్ఞప్తులు చేస్తున్నారు.

వందశాతం సీట్ల భర్తీయే లక్ష్యం..

జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలు 36 ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ డిగ్రీ కళాఽశాలలు ఆదిలాబాద్‌లో రెండు, ఉట్నూర్‌లో ఒకటి, ఇచ్చోడలో ఒకటి ఉండగా గిరిజన, సోషల్‌ వెల్ఫేర్‌ సంక్షేమ డిగ్రీ కళాశాలలు రెండు ఉన్నాయి. గతంలో కేవలం ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలు ఐదారు మాత్రమే ఉండగా, ప్రస్తుతం మండలానికి ఒకటి అన్నట్లుగా 28 వరకు చేరాయి. గతేడాది ప్రైవేట్‌ కళాశాలల్లో సీట్లు నిండక అధ్యాపకులు ఆందోళన చెందారు. ఆదిలాబాద్‌ పట్టణంలోని కళాశాలల పరిస్థితి అలాగే ఉండింది. దోస్త్‌ ద్వారా మూడు విడతల్లో సీట్ల భర్తీ చేయగా వందలోపే ప్రవేశాలు పొందారు. విద్యార్థులంతా తమ మండలాల్లోని ప్రైవేట్‌ కళాశాలల్లో చేరడంతో ప్రభుత్వ కళాశాలలు సైతం వెలవెలబోయాయి. చివరి విడతలో ప్రవేశాల సంఖ్య పెరిగింది. ఆదిలాబాద్‌ పట్టణంలోని సైన్స్‌ డిగ్రీ కళాశాలలో 660 సీట్లకు గాను 491 మంది చేరారు. ఆర్ట్స్‌ అండ్‌ కామర్స్‌ డిగ్రీ కళాశాలలో, ఇచ్చోడ డిగ్రీ కళాశాలలో 241 సీట్లకు గాను 163 మంది చేరారు. ఉట్నూర్‌ డిగ్రీ కళాశాలలో మాత్రం సీట్లు పూర్తి స్థాయిలో భర్తీ అయ్యాయి. ఇలా మొత్తం ఆయా కళాశాలల్లో 840 మంది చేరారు. ఈ ఏడాది కొత్తగా రెండు కోర్సులను అందుబాటులోకి తీసుకురాగా 120 సీట్లు అదనంగా పెంచారు. వీటి భర్తీ కోసం ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు పూర్తిస్థాయిలో శ్రమిస్తున్నారు.

విద్యార్థుల ఇళ్లకు లెక్చరర్లు..

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు ప్రవేశాల కోసం విస్తృతంగా శ్రమిస్తున్నారు. ప్రతిరోజు ఒకటి, రెండు గ్రామాలకు వెళ్తూ ప్రచా రం నిర్వహిస్తున్నారు. స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులను కలుస్తూ అడ్మిషన్లు పెంచేలా చూడాలని కోరుతున్నారు. అలాగే ప్రభుత్వ కళాశాలల్లో ప్ర స్తుతం ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులను అంబాసిడర్లుగా నియమించా రు. ఆ గ్రామంలో ఇంటర్‌ చదివిన విద్యార్థుల వివరాలను సేకరించారు. ఇది వరకే ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల్లో ఇంటర్‌ పూర్తి చేసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సెల్‌నంబర్లు, చిరునామాలు సేకరించి వాటి ఆధారంగా ఇళ్ల వద్దకు వెళుతూ వారిని కలుస్తున్నారు. ప్రైవేట్‌, కార్పొరేట్‌ కళాశాలల ప్రచారానికి మోసపోవద్దని, అర్హత కలిగిన లెక్చరర్లు తమ కళాశాలల్లో ఉన్నారని, అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని చెబుతూ అడ్మిషన్‌ తీసుకోవాలని కోరుతున్నారు.పూర్తిస్థాయిలో సీట్లను భర్తీ చేయడమే లక్ష్యంగా తీవ్రంగా శ్రమిస్తున్నారు.

సర్కారు కళాశాలల్లోనే నాణ్యమైన విద్య

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుంది. ఉన్నత విద్యతో పాటు అనుభవజ్ఞులైన అధ్యాపకులతో బోధన జరుగుతుంది. ప్రైవేట్‌ కళాశాలల ఆర్బాట ప్రచారం చూసి మోసపోవద్దు. ప్రభుత్వ కళాశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఈ ప్రవేశాల కోసం విద్యార్థులను అంబాసిడర్లుగా నియమించాం.

– జే. సంగీత, ప్రభుత్వ సైన్స్‌ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌, ఆదిలాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement