కౌంటింగ్‌కు సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

కౌంటింగ్‌కు సర్వం సిద్ధం

Feb 13 2026 3:14 AM | Updated on Feb 13 2026 3:14 AM

కౌంటింగ్‌కు సర్వం సిద్ధం

కౌంటింగ్‌కు సర్వం సిద్ధం

నేడు మున్సిపల్‌ ఓట్ల లెక్కింపు ఉదయం 8గంటల నుంచి షురూ తేలనున్న అభ్యర్థుల భవితవ్యం టీటీడీసీ వద్ద పటిష్ట బందోబస్తు

కై లాస్‌నగర్‌: మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో నేడు ఉదయం 8గంటల నుంచి కౌంటింగ్‌ ప్రక్రియ షురూ కానుంది. ఇందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. తొలుత పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కించనున్నారు. అనంతరం వార్డుల వారీగా ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. బ్యాలెట్‌ బాక్స్‌ల్లో నిక్షిప్తమై ఉన్న అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో వెల్లడి కానుంది. మధ్యాహ్నం 12గంటల వరకు పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశముంది. కౌంటింగ్‌ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా పోలీసులు పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి కేఆర్‌కే కాలనీకి వెళ్లే మార్గంలో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేయనున్నారు. వాహనాలను దారి మళ్లించనున్నారు. కౌంటింగ్‌ సిబ్బందికి అవగాహన కోసం ఇప్పటికే మాక్‌

కౌంటింగ్‌ నిర్వహించారు. ప్రత్యేక సమావేశం నిర్వహించి వారికి పలు సూచనలు చేశారు.

49వార్డులు.. 49టేబుళ్లు

ఆదిలాబాద్‌ మున్సిపల్‌ పరిధిలో మొత్తం 49 వార్డులున్నాయి. ఇందులో ప్రతీ వార్డుకు ఒక టేబుల్‌ చొప్పున 49 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ప్రతీ టేబుల్‌కు ఒక కౌంటింగ్‌ సూపర్‌వైజర్‌, ఇద్దరు కౌంటింగ్‌ అసిస్టెంట్లను నియమించారు. తొలుత పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కించి వాటి ఫలితాలను వెల్లడించాక బ్యాలెట్‌ బాక్స్‌ల్లోని ఓట్లను లెక్కిస్తారు. వార్డు పరిధిలోని పోలింగ్‌ కేంద్రాల వారీగా బ్యాలెట్‌ బాక్స్‌లను తెరుస్తారు. 25 ఓట్లకు ఒక బండిల్‌ చొప్పున కడతారు. ఆ తరువాత బండిళ్లన్నింటినీ డ్రమ్ములో వేసి బాగా కలుపుతారు. అనంతరం వెయ్యి ఓట్లకు ఒక రౌండ్‌ చొప్పున లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. ఈ ఫలితాలు వీక్షించేలా కౌంటింగ్‌ కేంద్రంలో ప్రత్యేక ఎల్‌ఈడీ స్క్రీన్‌ ఏర్పాటు చేశారు. ఫలితాల వెల్లడిలో జాప్యం జరగకుండా 49మంది ఆర్వోలు రౌండ్‌ వారీ ఫలితాలను ఎప్పటికప్పుడు డీపీఆర్వోకు పంపించే ఏర్పాట్లు చేశారు. అన్ని రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక అధికారికంగా వార్డు ఫలితాన్ని ప్రకటించనున్నారు.

పర్యవేక్షణకు ప్రత్యేకాధికారులు

ఓట్ల లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయి అధికారులను నోడల్‌ అధికారులుగా నియమించారు. 1నుంచి 12వార్డులకు డీపీవో రమేశ్‌, 13నుంచి 27వార్డులకు డీఆర్డీవో రాథోడ్‌ రవీందర్‌, 28నుంచి 33వార్డులకు ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ మనోహర్‌రావు, 39నుంచి 49వార్డులకు డీఎల్పీవో ఫణీందర్‌రావు నోడల్‌ అధికారులుగా వ్యవహరించనున్నారు. బ్యాలెట్‌ బాక్స్‌లను స్ట్రాంగ్‌ రూం నుంచి కౌంటింగ్‌ హాల్‌కు తీసుకువచ్చేందుకు మున్సిపల్‌ కార్మికులను, వారిని పర్యవేక్షించేందుకు ఐదుగురు మున్సిపల్‌ అధికారులను రో ఇన్‌చార్జీలుగా నియమించారు. వీరిందరికి ప్రత్యేక ఐడీ కార్డులు జారీ

చేయనున్నారు.

ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్‌

టీటీడీసీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రాన్ని కలెక్టర్‌ రాజర్షి షా గురువారం ఎన్నికల సాధారణ పరిశీలకుడు హనుమంత్‌ నాయక్‌తో పరిశీలించారు. నాలుగు హాళ్లలో కౌంటింగ్‌ ఉంటుందని, సుమారు 180మంది శిక్షణ పొందిన సిబ్బంది విధుల్లో ఉంటారని తెలిపారు. ఒక్కో టేబుల్‌ వద్ద మూడు రౌండ్ల లెక్కింపు ఉండగా, ప్రతీ రౌండ్‌కు సుమారు 90నిమిషాలు పట్టనుందని పేర్కొన్నారు. అడిషనల్‌ కలెక్టర్‌ రాజేశ్వర్‌, డీఆర్డీవో రాథోడ్‌ రవీందర్‌, డీపీవో రమేశ్‌, డీఎల్పీవో ఫణిందర్‌రావు తదితరులున్నారు.

తొలి ఫలితం 37వ వార్డుదే..

మెజార్టీ వార్డుల ఫలితాలు మూడు

రౌండ్లలో వెల్లడికానున్నాయి. 37వ వార్డు ఫలితం మాత్రం ముందుగా వచ్చే అవకాశముంది. ఈ వార్డులో 2,374 మంది ఓటర్లుండగా 1,467 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. పురుషులు 726, మహిళలు 741 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌లో 10మంది పురుషులు, ఒక మహిళ చొప్పున మొత్తం 1,478 మంది ఓటు వేశారు. అత్యంత తక్కువ ఓట్లు ఈ వార్డులోనే ఉన్నందున ఈ ఫలితం రెండు రౌండ్లలోనే వెల్లడికానుంది. ఇక నాలుగో వార్డు ఫలితం చివరగా వచ్చే అవకాశముంది. ఈ వార్డులో మొత్తం 3,832 ఓటర్లుండగా 1,458 మంది పురుషులు, 1,509 మహిళలు కలిపి 2,967 మంది ఓటు వేశారు. పోస్టల్‌ బ్యాలెట్‌లో పురుషులు ముగ్గురు ఓటు హక్కు వినియోగించుకోగా మొత్తం 2,970 ఓట్లు పోలయ్యాయి. నాలుగు రౌండ్లలో ఈ వార్డు ఫలితం వెల్లడయ్యే

అవకాశముంది.

ఓట్ల లెక్కింపునకు బందోబస్తు

ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం నిర్వహించనుండగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని, విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని పేర్కొన్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించవద్దని, కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తయ్యేదాకా సహకరించాలని కోరారు. జిల్లా కేంద్రంలోని ‘ఐలవ్‌ ఆదిలాబాద్‌’ నుంచి మావల పోలీస్‌స్టేషన్‌ వరకు ట్రాఫిక్‌ ఆంక్షలుంటాయని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement