పీహెచ్‌సీ వైద్యులకు పీజీ సీట్లు
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో పనిచేస్తున్న 18మంది వైద్యులకు పీజీ సీట్లు వచ్చాయి. జిల్లాలో 22 పీహెచ్‌సీలు, ఐదు పట్టణ ఆరోగ్యకేంద్రాలు, రెండు ఏరియా ఆస్పత్రులున్నాయి. పట్టణ ఆరోగ్యకేంద్రాల్లో రెగ్యులర్ వైద్యులు లేక కాంట్రాక్ట్ వైద్యులతో సేవలదింస్తున్నారు. జిల్లాలో 50 వైద్యాధికారుల పోస్టులు మంజూరు ఉండగా, 42మందే పనిచేస్తున్నారు. ఇప్పటికే ఎనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం మరో 18 వైద్యాధికారుల పోస్టులు నెలరోజుల్లో ఖాళీ కానుండగా రోగులకు ఇబ్బందులు తప్పేలా లేవు.
ఖాళీలు ఏర్పడే పీహెచ్‌సీలు
బజార్‌హత్నూర్ పీహెచ్‌సీలో నలుగురు వైద్యులకు, భీంపూర్, ఝరి, గుడిహత్నూర్‌లో ఇద్దరు చొప్పున, గాదిగూడ, సైద్‌పూర్, దంతన్‌పల్లి, నర్సాపూర్(టీ), పిట్టబొంగరం, ఇచ్చోడ, తలమడుగు, నేరడిగొండ పీహెచ్‌సీలో ఒక్కొక్కరికి పీజీ సీట్లు వచ్చాయి. ఇప్పటికే కొందరు జాయినింగ్ ఆర్డర్ ఇవ్వగా, మరికొంత మంది ఈనెల లోపు చేరనున్నారు. దీంతో బజార్‌హత్నూర్, నేరడిగొండ, పిట్టబొంగరం, గుడిహత్నూర్, గాదిగూడ, ఝరి, దంతన్‌పల్లి పీహెచ్‌సీల్లో ఒక్క వైద్యుడు కూడా లేని పరిస్థితి ఏర్పడనుంది.
ఇబ్బందులు లేకుండా చూస్తాం
జిల్లాలో 50 వైద్యుల పోస్టులకు 42మందే ఉన్నారు. ప్రస్తుతం 18మంది వైద్యాధికారులకు పీజీ సీట్లు వచ్చాయి. దీంతో రోగులకు ఇబ్బందులేర్పడనున్న విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. కాంట్రాక్ట్ పద్ధతిన పోస్టులను భర్తీ చేసేలా చర్యలు తీసుకుంటాం.
– నరేందర్ రాథోడ్, డీఎంహెచ్‌వో


