యువకుడి మృతిపై ఆందోళన
లక్సెట్టిపేట: ప్రైవేటు బ్యాంకులో గ్రూపు డబ్బుల విషయంలో జరిగిన గొడవలో యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, ఎస్సై గోపతి సురేష్ తెలిపిన వివరాల మేరకు వెంకట్రావుపేటకు చెందిన నాతరి ప్రశాంత్ (30) తల్లి నాతరి భాగ్య ఓ ప్రైవేటు బ్యాంకులో గ్రూపులోన్ తీసుకుంది. గతేడాది డిసెంబర్‌లో సభ్యురాలు సువర్ణకు కిస్తీ డబ్బులు చెల్లించింది. విషయం తెలియని ప్రశాంత్‌కూడా రూ.980 ఫోన్‌పే చేశాడు. డిసెంబర్ 2న ప్రశాంత్ వెళ్లి అడుగగా అక్కడే ఉన్న మరో సభ్యురాలు సంధ్యతో వాగ్వాదం జరిగింది. అక్కడే ఉన్న సంధ్య బంధువులు బైరం దినకర్, బైరం కృపాకర్ దాడికి దిగారు. అదేరోజు సాయంత్రం దాసరి సురేష్, బై రం దినకర్, బైరం కృపాకర్ మళ్లీ దాడి చేయడంతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఈనెల 8న ప్రశాంత్ కిందపడిపోవడంతో కుటుంబ సభ్యులు ముందుగా స్థానిక ఆస్పత్రికి, అక్కడి నుంచి మంచిర్యాలకు, అటు తర్వాత కరీంనగర్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
న్యాయం చేయాలని రాస్తారోకో
దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు సోమవారం స్థానిక అంబేడ్కర్ చౌరస్తా వద్ద ఆందోళనకు దిగారు. సుమారు రెండు గంటల పాటు రాస్తారోకో నిర్వహించడంతో ఇరువైపులా ట్రాఫిక్ నిలిచింది. సీఐ రమణామూర్తి, ఎస్సై గోపతి సురేష్ సంఘటనా స్థలానికి చేరుకుని దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతుని తల్లి భాగ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.


