ఉరేసుకుని ఒకరు..
ఇంద్రవెల్లి: ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై ఇ.సాయ న్న, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు దొడందా గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ చౌమాన్ హీరాలాల్ (28)కు రెండేళ్ల క్రితం కడెం మండలంలోని అల్లంపల్లి బాబానాయక్‌తాండకు చెందిన రాథోడ్ సరస్వతితో వివాహమైంది. కొంతకాలంగా మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్య, తల్లితో గొడవపడేవాడు. వారం రోజుల క్రితం భార్యతో కలిసి అత్తగారింటికి వెళ్లాడు. ఆమెను అక్కడే ఉంచి ఇంటికి వచ్చాడు. సోమవారం ఉదయం అతని తల్లి సుందబాయి పింఛన్ డబ్బుల కోసం నర్సాపూర్‌కు వెళ్లింది. మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూడగా ఇంట్లో ఉరేసుకుని కనిపించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
మద్యానికి బానిసై మరొకరు..
కాసిపేట: మద్యానికి బానిసై ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై గంగారాం తెలిపిన వివరాల మేరకు దేవాపూర్ రాంపూర్‌కు చెందిన తోటపల్లి శంకర్ (50) కూలీపని చేసుకుని జీవనం సాగించేవాడు. ఈక్రమంలో మద్యానికి బానిసయ్యాడు. కుటుంబ సభ్యులు పలుమార్లు మందలించినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. సోమవారం తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో బయటకు వెళ్లి అరగంట తర్వాత ఇంటికి వచ్చి తలుపులు వేసుకుని పడుకున్నాడు. 7 గంటల సమయంలో కుటుంబ సభ్యులు ఎంతపిలిచినా తలుపులు తీయకపోవడంతో గడ్డపార సాయంతో తొలగించి చూడగా దూలానికి చీరతో ఉరేసుకుని కనిపించాడు. మద్యం మానలేక, పనిచేయలేక మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుని భార్య దేవమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.


