దావత్ మస్తు..
మాంసం, బిర్యానీ, మద్యం పంపిణీ సభలు, సమావేశాలు, ర్యాలీలకు వచ్చేవారికి.. నేటితో ముగియనున్న పుర ఎన్నికల ప్రచారం
మంచిర్యాలటౌన్/మంచిర్యాలరూరల్(హాజీపూర్): మున్సిపల్ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం 5 గంటల్లోపు ముగియనుండడంతో, ఆదివారం పెద్దఎత్తున ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించి, దావతులను ఏర్పాట్లు చేశారు. చికెన్, మటన్ బిర్యానీ, మద్యం, మాంసం కూరలతో పెద్ద ఎత్తున దావతులను నిర్వహించారు. సభలు, సమావేశాలు, ర్యాలీల విజయవంతానికి ఒక్కొక్కరికి రూ.400 నుంచి రూ.500 వరకు చెల్లించి, ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం భోజనం, రాత్రి మందు, భోజనం పెట్టారు. నామినేషన్ వేసిన నాటినుంచే డివిజన్/వార్డుల్లో వారి బలగాన్ని ఎక్కువగా చూపించేందుకు అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. అధికార కాంగ్రెస్‌తోపాటు, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు గెలుపుకోసం తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఆదివారం సెలవు కావడంతో ఓటర్లు ఇళ్ల వద్దనే ఉండడంతో పెద్దఎత్తున ర్యాలీగా అభ్యర్థులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. వారి బలగాన్ని చూపించేందుకు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొనేలా చూస్తున్నారు. ర్యాలీలో పాల్గొన్న ప్రజలు, పార్టీల కార్యకర్తలకు మాంసహారంతో కూడిన భోజనాన్ని అందించారు.
గెలుపు కోసం పార్టీల కసరత్తు
మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాలను గెలవడంతోపాటు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మొదటి మేయర్ స్థానాన్ని చేజిక్కుంచుకోవాలని అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ బాధ్యతలను భుజస్కాందాలపై వేసుకున్నారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో సభలు, సమావేశాలు, కార్నర్ మీటింగ్‌లు ఏర్పాటు చేసి ప్రచారాన్ని చేస్తున్నారు. అక్కడికి వచ్చిన వారికి భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు పోటాపోటీగా చేపడుతున్న కార్యక్రమాల్లో పాల్గొనే వారికి మాత్రం విందు, మందుకు కొదువ ఉండడం లేదు. ర్యాలీలో స్వచ్చందంగా పాల్గొనే వారు కొందరే ఉండగా, మిగతా వారికి రోజుకు ఇంతా అని లెక్కగట్టి తీసుకువస్తున్నారు.


