‘సాక్షి’ ఆధ్వర్యంలో స్టడీ మెటీరియల్ పంపిణీ
ఉట్నూర్‌రూరల్: ‘సాక్షి’ మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు గురువారం మైనార్టీ గురుకులం, ఆశ్రమ క్రీడా పాఠశాల, జెడ్పీఎస్‌ఎస్ ఉట్నూర్, లక్కారం, బాలుర ఆశ్రమ పాఠశాల ఉట్నూర్, ఉర్దూ మీడియం పాఠశాలల్లో పదో తరగతి స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. సర్క్యూలేషన్ డివిజన్ ఇన్‌చార్జి ఖాజామొయినొద్దీన్ మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో ‘సాక్షి’ మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవసరమయ్యే స్టడీ మెటీరియల్‌ను సంస్థ ద్వారా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు స్టడీ మెటీరియల్‌ను సద్వినియోగం చేసుకుని పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని సూచించారు. మండల విద్యాధికారి ఆశన్న మాట్లాడుతూ.. ‘సాక్షి’ మీడియా గ్రూప్ పత్రికా రంగంలో రాణిస్తూ మరో వైపు విద్యార్థుల సౌకర్యార్థం పదో తరగతిలో మంచి మార్కులు సాధించేలా తోడ్పాటునందించడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


