గిరిజన గ్రామాల అభివృద్ధే లక్ష్యం
నెన్నెల: మండలంలోని మారుమూల గిరిజన గ్రామాలైన పాటి, బోగంపల్లిలకు రోడ్డు నిర్మాణంతో పాటు స్థానికంగా నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని జిల్లా గ్రామీణాభివద్ధి అధికారి కిషన్ అన్నారు. ఎంపీడీవో అబ్దుల్‌హైతో కలిసి బుధవారం గ్రామాలను సందర్శించారు. అక్కడి ప్రజలు ఈ నెల 2న కలెక్టర్ కుమార్‌దీపక్‌ను కలిసి రోడ్డు నిర్మించాలని, గిరివికాస్ బోర్లకు కరెంట్ కనెక్షన్‌లు, సాగులో ఉన్న వారికి పోడు పట్టాలు ఇవ్వాలని వినతిపత్రం అందజేశారు. స్పందించిన కలెక్టర్ క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గ్రామాలను సందర్శించిన అధికారులు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు నిర్మాణం, గిరివికాస్ బోర్లకు కరెంట్ కనెక్షన్‌లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఉపాధిహామీ పనుల్లో హాజరుశాతం పెంచాలని సూచించారు. వారి వెంట మన్నెగూడం సర్పంచ్ బానోతు మధుకర్, ఏపీఓ నరేష్, గిరిజన నాయకులు కొడిపె శంకర్ తదితరులు ఉన్నారు.


