వార్కవాయిని జీపీగా ఏర్పాటు చేయాలి
నార్నూర్: గాదిగూడ మండలంలోని వార్కవాయి గ్రామ కేంద్రంగా నూతన పంచాయతీ ఏర్పాటు చేయాలని నాలుగు గ్రామాల ప్రజలు బుధవారం ప్రత్యేక సమావేశమై ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల పటేళ్లు మాట్లాడుతూ వార్కవాయి, కౌటాల, లింగుగూడ, బొజ్జుగూడ గ్రామాలు కలిసి మొత్తం 665 ఓటర్లు ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం ఉన్న గ్రామ పంచాయతీలకు గ్రామాలు దూరంగా ఉండడంతో సరైన పాలన అందడం లేదని అన్నారు. అలాగే మౌలిక సదుపాయాలు లేక అవస్థలు పడుతున్నామని తెలిపారు. చిన్న చిన్న పనులకు కోసం దూరంగా ఉన్న పంచాయతీలకు వెళ్లాల్సి వస్తోందని పేర్కొన్నారు. నూతన గ్రామ పంచాయతీ ఏర్పాటు కోసం ఎంపీ నగేశ్‌తో పాటు స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మి, కలెక్టర్ రాజర్షిషాను కలిసి వినతి పత్రాలు అందజేయాలని నిర్ణయించారు. కార్యక్రమంలో గ్రామ పటేళ్లు ఆత్రం నాగోరావు, కుడ్మెత అమృత్‌రావు, చంపత్‌రావు, పంద్ర మారోతితో పాటు ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.


