రహదారి నిబంధనలు పాటించాలి
ఆదిలాబాద్‌టౌన్: వాహనదారులు తప్పనిసరిగా రహదారి నిబంధనలు పాటించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో అరైవ్– అలైవ్ కార్యక్రమంలో భాగంగా 84 మంది డ్రైవర్లకు మంగళవారం ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడుపొవద్దన్నారు. అలాగే ఓవర్‌లోడింగ్, రాంగ్‌రూట్ డ్రైవ్, ర్యాష్ డ్రైవ్, ఓవర్ స్పీడ్ చేయవద్దని సూచించారు. అతివేగంతోనే ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తే సీజ్ చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ జీవన్‌రెడ్డి, సీఐలు సునీల్ కుమార్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


