నామినేషన్ల కేంద్రం వద్ద మూడంచెల భద్రత
కై లాస్‌నగర్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా సాగేలా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. నామినేషన్ల దాఖలుకు అభ్యర్థులు భారీసంఖ్యలో వచ్చే అవకాశముండటంతో ఆదిశగా పలు మార్పులు చేశారు. తొలిరోజు అంతగా పట్టించుకోని అధికారులు రెండోరోజు నిబంధనలు కఠినతరం చేశారు. ప్రక్రియకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మూడంచెల పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు. నామినేషన్లు దాఖలు చేసే జిల్లా కేంద్రంలోని టీటీడీసీకి వెళ్లే దారిలో గల కలెక్టర్ క్యాంపు కార్యాలయం వద్ద, కేంద్రానికి వంద మీటర్ల దూరంలో, కేంద్రం ప్రధాన గేట్ వద్ద ప్రత్యేకంగా బారికేడ్లు ఉంచారు. ట్రాఫిక్, ఏఆర్ పోలీసులను భారీగా మోహరించారు. ఎస్సై స్థాయి అధికారులను నియమించారు. నామినేషన్ వేసేందుకు వచ్చే అభ్యర్థులు, వారి వెంట వెళ్లే ప్రతిపాదకుల సెల్‌ఫోన్లను కేంద్రంలోనికి అనుమతించడంలేదు. వాటిని డిపాజిట్ చేసుకునేందుకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి ఇద్దరు బల్దియా సిబ్బందిని నియమించారు. టీటీడీసీ కేంద్రంలోని మీడియా పాయింట్‌ను వంద మీటర్ల దూరంలో, హెల్ప్ డెస్క్‌ను కేంద్రం ప్రధాన గేట్‌కు కుడి వైపు ఏర్పాటు చేశారు. నామినేషన్లు వేసే అభ్యర్థులను మినహా ఇతరులెవరిని ఆ మార్గం గుండా అనుమతించకుండా దారి మళ్లించారు. నామినేషన్ వేసేందుకు వచ్చిన అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేసేలా, వారు పాటించాల్సిన జాగ్రత్తలు సూచించేలా ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేశారు. డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి పోలీస్ భద్రతను పర్యవేక్షించారు.


