● పండుగ రద్దీ దృష్ట్యా ప్రత్యేక బస్సులు ● 315 సర్వీసులు
ఆదిలాబాద్: సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమైంది. వరుస సెలవుల నేపథ్యంలో హైదరాబాద్ వంటి దూర ప్రాంతాల్లో ఉన్న వారు సొంత ఊర్లకు రానున్నారు. ఈమేరకు ప్రయాణికుల సౌకర్యార్థం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఐదు డిపోల పరిధిలో ప్రత్యేక బస్సులు నడిపేందుకు యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది. అయితే టికెట్‌పై 50శాతం అదనపు చార్జీ వసూలు చేయనున్నట్లుగా ప్రకటించింది.
7 నుంచి 14వ తేదీ వరకు..
సంక్రాంతి పండుగకు రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 11నుంచి 17వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. హైదరాబాద్‌లో ఉన్నత విద్యాభ్యాసం చేసే విద్యార్థులు, ప్రైవేటు ఉద్యోగాలు చేసే వారు పండుగకు సొంత ఊర్లకు వస్తుంటారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లా నుంచి భాగ్యనగరానికి, హైదరాబాద్ నుంచి ఉమ్మడి జిల్లాకు బుధవారం నుంచి ఈనెల 14 వరకు 315 స్పెషల్ బస్సులు నడవనున్నాయి. అయితే ఈనెల 9నుంచి 12వరకు ఆదిలాబాద్ రీజియన్‌లోని బస్సులు హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి కాకుండా సికింద్రాబాద్ జేబీఎస్ నుంచి బయలుదేరనున్నాయి. రాజధానిలో సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా ఈ మేరకు ఈ సర్వీస్లన్ని జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఆపరేట్ చేయనున్నారు. రద్దీ అంచనాలకు మించి ఉంటే దానికి అనుగుణంగా మరిన్ని బస్సులు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
ముందస్తు రిజర్వేషన్ కోసం..
రిజర్వేషన్ చేసుకోవాలనుకునే ప్రయాణికుల సౌకర్యార్థం బస్టాండ్లలో కౌంటర్లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే www. tgsrtcbus. In వెబ్‌సైట్ ద్వారా కూడా సీటు రిజర్వ్ చేసుకోవచ్చు.
ప్రయాణికుల జేబుకు చిల్లు..
సాధారణంగా పండుగ సమయాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే మహాలక్ష్మి ప్రయాణికులతో బస్సులన్నీ కిక్కిరిసి వెలుతున్నాయి. దీంతో టికెట్ కొనుగోలు చేసిన ప్రయాణికులు నిలబడి వెళ్లాల్సిన దుస్థితి. తాజాగా స్పెషల్ బస్సుల్లో రద్దీ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీనికి తోడు ప్రత్యేక సర్వీసుల్లో ఏకంగా 50శాతం అదనపు చార్జీ వసూలు చేసేందుకు ఆర్టీసీ నిర్ణయించింది. దీంతో ప్రయాణికుల జేబులకు చిల్లు పడనుంది. గతంలో సూపర్ లగ్జరీ, లహరి, రాజధాని వంటి హై అండ్ సర్వీసుల్లోనే అదనపు చార్జీలు వసూలు చేసేవారు. ఈసారి ఏర్పాటు చేసిన ప్రతీ స్పెషల్ బస్సులోనూ అదనపు వడ్డనకు రంగం సిద్ధమైంది.
విద్యార్థులకు ‘ప్రత్యేక’ సర్వీసులు
విద్యా సంస్థలకు సెలవుల నేపథ్యంలో తమ సొంత ఊర్లకు రావాలనుకునే విద్యార్థులకు సంస్థ ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. విద్యార్థులు ఒకేచోట 50 మంది ఉంటే, వారు ఉన్నచోటికి బస్సును పంపి తమ గమ్యస్థానాలకు చేర్చనుంది. ఈమేరకు సంబంధిత డిపో మేనేజర్లను సంప్రదిస్తే ప్రత్యేక సర్వీసులు వారికోసం ఆపరేట్ చేస్తారు.
డిపో బస్సుల సంఖ్య
ఆదిలాబాద్ 64
భైంసా 15
నిర్మల్ 99
ఆసిఫాబాద్ 36
మంచిర్యాల 101
● పండుగ రద్దీ దృష్ట్యా ప్రత్యేక బస్సులు ● 315 సర్వీసులు
● పండుగ రద్దీ దృష్ట్యా ప్రత్యేక బస్సులు ● 315 సర్వీసులు


