ఆదివాసీలు అన్ని రంగాల్లో రాణించాలి
గుడిహత్నూర్: ఆదివాసీలు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకుని అన్ని రంగాల్లో రాణించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మండలంలోని గర్కంపేట్‌లో ఆదివాసీలకు బుధవారం దుప్పట్లు పంపిణీ చేసి మాట్లాడారు. ఏజెన్సీ పరిధిలోని పిల్లలంతా చదువుకునేలా తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలన్నారు. అలాగే యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. సర్పంచ్ మడా వి కేశవ్ పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, ఈ వో మనోహర్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, మండల ప్రత్యేకాధికారి సునీత, డీపీవో రమేశ్, ఎంపీడీవో ఇంతియాజ్, ఎంపీవో దిలీప్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
రాజ్యాంగంపై అవగాహన అవసరం
కైలాస్‌నగర్/ఆదిలాబాద్‌రూరల్: ప్రతీ పౌరుడు రాజ్యాంగంపై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. పౌర హక్కుల దినోత్సవం పురస్కరించుకుని స్థానిక బొక్కల్‌గూడలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలకు రాజ్యాంగం ద్వారానే హక్కులు లభిస్తున్నాయనే విషయాన్ని గుర్తించాలన్నారు. అనంతరం వృద్ధులకు చేతికర్రలు, మంకీ క్యాపులు పంపిణీ చేశారు. ఇందులో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, అర్బన్ తహసీల్దార్ శ్రీనివాస్, ఎంఈవో సోమయ్య తదితరులు పాల్గొన్నారు.
బొకేలు.. శాలువాలు వద్దు
కై లాస్‌నగర్: నూతన సంవత్సరం 2026 సందర్భంగా బొకేలు, శాలువాలకు బదులు పేదలకు ఉపయోగపడే వస్తువులు మాత్రమే తీసుకురావాలని కలెక్టర్ రాజర్షి షా ప్రకటనలో తెలిపారు. తనను కలవడానికి వచ్చే అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు కమ్ విత్ బుక్ నినాదంతో పిల్లల సాహిత్య పుస్తకాలు తీసుకువచ్చి పాఠశాల గ్రంథాలయాలకు విరాళంగా అందించాలని విజ్ఞప్తి చేశారు. దుప్పట్లు, పాఠ్యపుస్తకాలు, పెన్నులు, స్టేషనరీ సామగ్రి వంటివి ఈ కార్యక్రమం ద్వారా సేకరించి జిల్లాలోని పేదలు, విద్యార్థులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
ఆరు సూత్రాలు పాటించాలి
ఆదిలాబాద్‌టౌన్: విద్యార్థులు నిరంతరం ఆ రోగ్య సూత్రాలు పాటించాలని కలెక్టర్ రా జర్షిషా అన్నారు. బుధవారం జెడ్పీ సమావేశ మందిరంలో ఆరోగ్య పాఠశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులు మంచి ఆరోగ్య అలవాట్లను అవలంభించేందుకు ఆరోగ్య పాఠశాల కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఆరోగ్య పాఠశాలకు సంబంధించి ఉత్తమ ప్రదర్శన కనబర్చిన జందాపూర్ యూపీఎస్, ఉట్నూర్ గిరిజన ఆశ్రమ పాఠశాల, యాపల్‌గూడ ప్రాథమిక పాఠశాల, మావలలోని మహాత్మా జ్యోతిబాఫూలే జూనియర్ కళాశాల, ఝరి గిరిజన ఆశ్రమ పాఠశాల, హస్నాపూర్ జెడ్పీఎస్‌ఎస్, బాలక్ మందిర్ ప్రభుత్వ పాఠశాల, ఖానాపూర్ యూపీఎస్ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డీఈవో రాజేశ్వర్, సెక్టోరియల్ అధికారి తిరుపతి పాల్గొన్నారు.


