వృద్ధుడి ఆత్మహత్య
లోకేశ్వరం: మండలంలోని పిప్రి గ్రామానికి చెందిన గంప భోజన్న(78) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై అశోక్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. భోజన్న కొంతకాలంగా మోకాలు నొప్పులతో బాధపడుతున్నాడు. ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకున్నా నయం కాలేదు. మంచంపై కదల్లేని స్థితికి చేరడంతో కుటుంబ సభ్యులు ఓ గదిలో వేరుగా ఉంచారు. జీవితంపై విరక్తి చెంది సోమవారం పురుగుల మందు తాగాడు. బైంసా ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారు జామున మృతిచెందాడు. అతడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమారుడు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
డ్రైవర్‌కు మూడున్నరేళ్ల జైలు
చెన్నూర్: రోడ్డు ప్రమాదం కేసులో డ్రైవర్‌కు మూడున్నరేళ్ల జైలుశిక్ష విధిస్తూ స్థానిక జూనియ ర్ సివిల్ జడ్జి పర్వతపు రవి బుధవారం తీర్పునిచ్చినట్లు సీఐ దేవేందర్‌రావు తెలిపారు. చెన్నూర్ పట్టణంలోని దుబ్బాగూడెం కాలనీకి చెందిన కడవండి రాజపోషం 2019 జనవరి 30న మంచిర్యాలలోని సదరం క్యాంపు కోసం టాటా మ్యాజిక్ వాహనంలో వెళ్తున్నాడు. డ్రైవర్ నిట్టూరి రాజబాబు వాహనాన్ని అతివేగంగా నడిపి చెన్నూర్ మండలం కిష్టంపేట ఫారెస్ట్ నర్సరీ వద్ద ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను ఢీకొట్టాడు. దీంతో రాజపోషం అక్కడికక్కడే మృతిచెందగా, మహారాష్ట్ర గడిచిరోలి జిల్లా సిరొంచకు చెందిన మర్రి రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి సీఐ ప్రమోద్‌రావు డ్రైవర్ రాజబాపుపై కేసు నమోదు చేశారు. కోర్టులో సాక్షులను విచారించగా.. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఒకరు మృతిచెందినట్లు రుజువు కావడంతో నిందితుడికి మూడున్నరేళ్లు జైలు శిక్ష విధించారు.
కోతులను తరిమిన
ఎలుగుబంటి వేషధారి
జన్నారం: రోజురోజుకు కోతుల బెడద పెరిగిపోతుండడంతో గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కోతుల బెడదను తొలగిస్తామని హామీలు ఇచ్చి గెలిచిన సర్పంచులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మండలంలోని కలమడుగు గ్రామంలో సర్పంచ్ బొంతల నాగమణి గ్రామంలో ఒక వ్యక్తికి ఎలుగుబంటి వేషధారణ వేయించి కోతులు ఉన్న ప్రాంతంలో తిప్పుతున్నారు. చూసిన కోతులు పరుగులు తీస్తున్నాయి. గ్రామంలో ఎక్కడైన కోతుల బెడద ఉంటే సంప్రదించాలని సర్పంచ్ నాగమణి సూచించారు.
వృద్ధుడి ఆత్మహత్య


