క్రీడల్లోనూ రాణించాలి
ఆదిలాబాద్‌రూరల్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మండలంలోని బంగారుగూడ బాలికల మైనార్టీ రెసిడెన్షియల్‌లో ఉమ్మడి జిల్లాస్థాయి గేమ్స్–స్పోర్ట్స్ మీట్ 2025–26 ఆదివారంతో ముగిసింది. కార్యక్రమానికి కలెక్టర్ అతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడల్లో గెలుపోటములు సహజమన్నారు. ఓటమితో నిరుత్సాహ పడకుండా నిరంతరం కృషి చేస్తే విజయం సాధించవచ్చన్నారు. కాగా, ఖోఖో, పరుగుపందెం, బ్యాడ్మింటన్, కబడ్డీ, వాలీబాల్ తదితర క్రీడా పోటీల్లో సుమారు 550 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో ప్రతిభ కనబర్చిన వారికి ప్రశంసాపత్రాలతో పాటు మెమోంటోలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి కలీం, తదితరులు ఉన్నారు.


